గవర్నర్‌ నరసింహన్‌కు మాతృవియోగం

20 Oct, 2017 16:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తల్లి విజయలక్ష్మి (94) శుక్రవారం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను పరామర్శించారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అనంతరం ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌తోపాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు నరసింహన్‌ను ఫోన్‌ చేసి పరామర్శించారు.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు ఈటల, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్, శాసనసభాపక్ష నేత జానారెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, ఏపీ మంత్రులు లోకేశ్, మాణిక్యాలరావు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి కళా వెంకట్రావు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు విజయలక్ష్మి భౌతికకాయానికి నివాళులర్పించి గవర్నర్‌ను పరామర్శించారు. గవర్నర్‌ తల్లి విజయలక్ష్మి తన మరణానంతరం కళ్లను దానం చేయాలని కోరడంతో నగరంలోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి వైద్య నిపుణులు వాటిని సేకరించారు. తన తల్లి అస్తికలను శనివారం త్రివేణి సంగమం గోదావరిలో కలిపేందుకు గవర్నర్‌ కాళేశ్వరానికి వెళ్లనున్నట్లు తెలిసింది.

అంతిమ యాత్రలో సీఎం కేసీఆర్‌
గవర్నర్‌ తల్లి విజయలక్ష్మి అంతిమ యాత్రలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి వర్గ సహచరు లంతా పాల్గొన్నారు. అనంతరం పంజగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలకు హాజరయ్యారు.

>
మరిన్ని వార్తలు