భూపంపిణీకి మంగళం!

18 Aug, 2018 03:19 IST|Sakshi

క్రమంగా తగ్గిస్తున్న ఎస్సీ కార్పొరేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకం అటకెక్కుతోంది. ఈ పథకం అమలుకు సంబంధించి వార్షిక లక్ష్యాలు క్రమంగా తగ్గుతున్నాయి. 2018–19 వార్షిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 159 మంది లబ్ధిదారులకే భూ పంపిణీ చేసేలా ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాచరణ రూపొందించడం గమనార్హం.  భూపంపిణీ పథకం కింద 2017–18 వార్షిక సంవత్సరంలో రూ.165 కోట్లు కేటాయిస్తూ.. 1,529 మంది దళిత రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాచరణ రూపొందించింది.

ఈ మేరకు 3,609 ఎకరాలు గుర్తించింది. ఈ భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి విక్రయించి దళితులకు ఇచ్చేలా ఏర్పాటు చేసింది. కానీ ప్రస్తుత వార్షిక సంవత్సరంలో లక్ష్యాలు దారుణంగా పతనమయ్యాయి. గతేడాదితో పోలిస్తే 2018–19 వార్షిక సంవత్సరంలో పదోవంతు మందికే భూపంపిణీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. మొత్తంగా 159 మంది లబ్ధి్ధదారులకు 406 ఎకరాల భూమిని పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. రూ.18.5 కోట్లు బడ్జెట్‌ కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు.

22 జిల్లాలు నిల్‌.. : పట్టణీకరణ ప్రభావంతో హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో ఈ పథకం మొదటి నుంచీ అమలు కాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కూడా భూపంపిణీ నుంచి మినహాయింపునిచ్చారు. తాజా వార్షిక సంవత్సరంలో 22 జిల్లాలో భూపంపిణీ పథకాన్ని అమలు చేయట్లేదు. భూపంపిణీ అమలు కాని జాబితాలో జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమురంభీం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, యాదాద్రి జిల్లాలున్నాయి.

ఈసారి ఆదిలాబాద్‌ జిల్లాలో 107 మందికి భూపంపిణీకి లక్ష్యాన్ని నిర్దేశించారు. జోగుళాంబ గద్వాల, కామారెడ్డి జిల్లాలకు కలిపి 27 మంది, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 మందికి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ముగ్గురికి ఎస్సీ కార్పొరేషన్‌ భూపంపిణీ చేయనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రియల్‌ ఎస్టేట్‌ భూమ్‌ అంతటా విస్తరించింది. దీంతో భూపంపిణీకి భూముల సమస్య తలెత్తింది.

మరిన్ని వార్తలు