విశ్వనగరమే లక్ష్యంగా..

11 Feb, 2019 09:16 IST|Sakshi

మూడేళ్లలో గ్రేటర్‌ అభివృద్ధికి బాటలు

రూ.వేల కోట్లతో పలు కార్యక్రమాలు

సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరానికి బాటలు వేసేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రేటర్‌ పాలక వర్గం ఏర్పడి మూడేళ్లు పూర్తవగా పలు అభివృద్ధి పనులు కీలక దశలో ఉన్నాయి. పలు కార్యక్రమాల్లో జాతీయ అవార్డులు దక్కించుకొని ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలిచింది. సుమారు రూ.22 వేల కోట్ల వ్యయంతో ఎస్‌.ఆర్‌.డి.పి పనులు, రూ.8,300 కోట్ల వ్యయంతో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు, రూ.1523 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ల నిర్మాణాలు (కేంద్రం)నిధులతో రూ.500 కోట్ల వ్యయంతో అంతర్గత రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టింది.  
ప్రస్తుతం ప్రగతి ఇలా...

సుమారు 339 ఎకరాల్లో 12 మిలియన్ల టన్నుల మున్సిపల్‌ వ్యర్థాలతో 4,44,025 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన జవహర్‌నగర్‌ డంప్‌యార్డ్‌ క్యాపింగ్‌ పనులు 90 శాతం పూర్తయ్యాయి. రూ.350 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం ఆరు దశల్లో చేపట్టే ఈ క్యాపింగ్‌ పనులు దేశంలోనే అతిపెద్ద డంప్‌యార్డ్‌ క్యాపింగ్‌ పనులుగా నిలిచాయి.  
హైదరాబాద్‌ నగరంలో సిగ్నల్‌ ఫ్రీ రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడానికి రూ.23 వేల కోట్ల అంచనా వ్యయంతో స్కై వేలు, మేజర్‌ కారిడార్లు, గ్రేడ్‌ సపరేటర్లు, అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ చేపట్టింది. ఈ కార్యక్రమంలో చేపట్టిన మూడు అండర్‌ పాస్‌లు అయ్యప్ప సొసైటీ, మైండ్‌స్పేస్, ఎల్బీనగర్‌ చింతల కుంట అండర్‌పాస్‌లు, కామినేని జంక్షన్, మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ ఫ్లైఓవర్లను కూడా ప్రారంభించారు. 
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్‌.ఆర్‌.డి.పి)లో భాగంగా మొదటి దశలో రూ. 2399.64కోట్ల వ్యయంతో పలు ఫ్లైఓవర్లు, కారిడార్లు, రోడ్‌ అండర్‌ బ్రిడ్జి, కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయి
దేశంలోనే మొదటిసారిగా జీహెచ్‌ఎంసీలో డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అనుకోని ఉపద్రవాల నుండి రక్షించడం, అక్రమ కట్టడాలు, నిర్మాణాలను తొలగించడం, జీహెచ్‌ఎంసీ ఆస్తుల పరిరక్షణ, అగ్నిప్రమాదాలు తదితర ఉపద్రవాలను ఎదుర్కొనేలా ఈ టీమ్‌ పనిచేస్తుంది.
హైదరాబాద్‌ నగర ప్రజల కోసం లగ్జరీ లూ–కేఫేలను టి.పి.పి పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నారు.  
ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్‌ను మరింత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి రూ.35.10 కోట్ల వ్యయంతో చేపట్టిన చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్ట్‌ పనులు తుది దశలో ఉన్నాయి.  
గ్రేటర్‌ హైదరాబాద్‌లో గత మూడు సంవత్సరాలుగా హరితహారంలో భాగంగా రెండు కోట్ల మొక్కలకుపైగా నాటడం జరిగింది.  
గ్రేటర్‌లో రూ.19.37 కోట్ల వ్యయంతో 38 మోడల్‌ మార్కెట్ల నిర్మాణం చేపట్టగా 35 మార్కెట్లు పూర్తయ్యాయి.
నగరంలో కేవలం ఐదు రూపాయలకే భోజనాన్ని అందించేందుకు 150 కేంద్రాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. అన్నపూర్ణ పథకంగా పిలుస్తున్న ఈ భోజన కేంద్రాల ద్వారా ప్రతిరోజు 40 వేల మందికి భోజనాన్ని అందిస్తున్నారు.  
 2018 జనవరి నాటికి నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు ప్రాజెక్ట్‌ పూర్తయ్యింది.  
పూణె మున్సిపాలిటీ అనంతరం జీహెచ్‌ఎంసీ వంద శాతం ఆన్‌లైన్‌ విధానం ద్వారా భవన నిర్మాణ అనుమతులను జారీచేసే కార్పొరేషన్‌గా పేరొందింది.
నాలుగు ప్రాంతాల్లో రూ.13 కోట్ల వ్యయంతో ఫిష్‌మార్కెట్ల నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టింది.  
నగరంలో నిరాశ్రయుల సౌకర్యార్థం 15 షెల్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో మూడు షెల్టర్‌ హోంలను ప్రత్యేకంగా పేషంట్ల అటెండెంట్లకు ఏర్పాటు చేయగా మరో 4 షెల్టర్ల నిర్మాణం పురోగతిలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు