29 కిలోమీటర్లు...22 నిమిషాలు!

27 Jun, 2019 09:08 IST|Sakshi

లక్డీకాపూల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు...

లైవ్‌ ఆర్గాన్‌ గుండెను తరలించిన వైద్యబృందం

గ్రీన్‌ఛానల్‌ ఇచ్చి సహకరించిన ట్రాఫిక్‌ పోలీస్‌

సాక్షి, సిటీబ్యూరో: లక్డీకాపూల్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రి–శంషాబాద్‌లోని విమానాశ్రయం మధ్య ఉన్న 29 కిమీ మార్గాన్ని లైవ్‌ ఆర్గాన్‌ గుండెతో కూడిన అంబులెన్స్‌ కేవలం 22 నిమిషాల్లో అదిగమించింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా సిటీ ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ ఛానల్‌ ఇచ్చినట్లు అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. నగర ట్రాఫిక్‌ విభాగంలో మధ్య, పశ్చిమ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్‌లెస్‌ సెట్స్‌ అన్నీ బుధవారం ఉదయం ఒక్కసారిగా మోగాయి. లక్డీకాపూల్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రిలో ఉన్న డోనర్‌ తన గుండె, ఊపిరితిత్తులను దానం చేశారని, అవి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతంలోని ఆస్పత్రికి చేరాల్సి ఉందని సమాచారం అందింది. ఆ ఆస్పత్రుల్లో దీన్ని రిసీవ్‌ చేసుకోవాల్సిన రోగి ఆపరేషన్‌ మొదలైంది. లైవ్‌ ఆర్గాన్‌ గుండెతో కూడిన అంబులెన్స్‌ మధ్యాహ్నం 12.37 గంటలకు లక్డీకాపూల్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రి నుంచి బయలుదేరింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక సిబ్బందిని రంగంలోకి దింపారు. దీనికి దాదాపు రెండు గంటల ముందు నుంచే ఈ రూట్‌లో ఉన్న జంక్షన్స్‌లో ప్రత్యేక చర్యలు మొదలయ్యాయి. డోనర్‌ ఇచ్చిన గుండెతో కూడిన బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్‌ విమానాశ్రయం వరకు ఉన్న 29 కిమీ దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్‌ పోలీసులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు సైబరాబాద్‌ అధికారుల సాయం కూడా తీసుకున్నారు.  ఆ సమయంలో ఈ రూట్‌ రద్దీగా ఉంటుంది. దీనికితోడు ఇతర జంక్షన్లలోనూ దూసుకువచ్చే వాహనాల వద్ద ప్రమాదాలు, ఆటంకాలు లేకుండా చూడటానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఓ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్లడానికి సిద్ధమైంది. బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంత పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. గ్లోబల్‌ ఆస్పత్రి నుంచి బయలుదేరిన ‘లైవ్‌ ఆర్గాన్స్‌ బాక్స్‌’తో కూడిన అంబులెన్స్‌  మాసబ్‌ట్యాంక్, మెహదీపట్నం, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌ వే మీదుగా ప్రయాణించి సరిగ్గా 12.59 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్‌ పోలీసులు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా కాపు కాశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న విమానంలో ఈ ఆర్గాన్‌ను వైద్యులు తీసుకువెళ్లిపోయారు. 

మరిన్ని వార్తలు