నగరానికి గల్ఫ్‌ క్షమాభిక్ష బాధితులు

3 Oct, 2018 00:47 IST|Sakshi
గల్ఫ్‌ నుంచి తిరిగి వచ్చిన బాధితులతో మాట్లాడుతున్న కేటీఆర్‌

వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధి కోసం గల్ఫ్‌కు వలస వెళ్లి పలు కేసుల్లో చిక్కుకుని, అక్కడి ప్రభుత్వం నుంచి క్షమాభిక్ష పొందిన బాధితులు హైదరాబాద్‌ చేరుకున్నారు. యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష సాయంతో మంగళవారం రాష్ట్రానికి తిరిగి వచ్చిన 30 మంది గల్ఫ్‌ బాధితులకు రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ శాఖ మంత్రి కె.తారక రామారావు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సరైన వీసా లేని తెలంగాణ వాసులను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు యూఏఈకి వెళ్లిన రాష్ట్ర అధికారుల బృందం చొరవతో వీరు రాష్ట్రానికి చేరుకున్నారు. మంత్రి కేటీఆర్‌ విమానాశ్రయంలో వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

సరైన వీసాలు లేకుండా వలస వెళ్లడంతో ఎదుర్కొన్న సమస్యలను మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. అబుదాబిలో తెలుగు భాష వచ్చే అధికారులు అందుబాటులో ఉంటే మరింత సౌకర్యంగా ఉంటుందనే విషయాన్ని మంత్రికి తెలిపారు. టికెట్ల కొనుగోళ్లతోపాటు వివిధ కేసులకు సంబంధించిన బకాయి జరిమానాలను చెల్లించేందుకు డబ్బుల్లేక చాలా మంది క్షమాభిక్ష అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారని మంత్రికి వివరించారు. అలాంటివారికి టికెట్లను ప్రభుత్వమే సమకూరుస్తుందని, జరిమానాల విషయంలోనూ సహకరిస్తుందని మంత్రి వారికి భరోసా కల్పించారు. భారత రాయబారితో స్వయంగా మాట్లాడి గల్ఫ్‌ బాధితులకు సహకరించాలని కోరుతానన్నారు.

గల్ఫ్‌ నుంచి తిరిగి వచ్చిన బాధితులకు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గల్ఫ్‌ నుంచి తిరిగి వచ్చిన వారితో త్వరలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. క్షమాభిక్ష సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకునే వారు తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ శాఖ ఫోన్‌ నంబర్‌ 9440854433ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు రాజేంద్రనగర్‌ మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు