కష్టాల చదువు

18 Jul, 2014 03:21 IST|Sakshi
కష్టాల చదువు

* సమస్యల వలయంలో గురుకుల, ఆశ్రమ పాఠశాలలు
* మూత్రశాలలు.. స్నానాల గదులు కరువు
* అర్ధరాత్రయినా... ఆరుబయటకే
* బాలికల పాఠశాలలకు ప్రహరీలు లేవు
* పట్టిపీడిస్తున్న ఉపాధ్యాయుల కొరత
 పాలమూరు : ఆర్థిక స్థోమత లేక.. చదువుపై ఉన్న మక్కువతో సర్కారు ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులు అక్కడి అరకొర వసతులతో నిత్యం సతమతమవుతున్నారు. జిల్లాలోని పలు ఆశ్రమ, గురుకుల పాఠశాలలు అసౌకర్యాలకు నిలయంగా మారాయి. అక్కడ చేరిన విద్యార్థులకు క్షేమం లేకుండా పోయింది. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 12 గురుకుల పాఠశాలలు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 16 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, 6 గిరిజన కులాలు, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 4 గురుకుల పాఠశాలలు, మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2 గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఇందులో 16,600 మంది విద్యార్థులు వసతితోపాటు విద్యను అభ్యసిస్తున్నారు.

జిల్లాలోని పలు ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు కల్పించిన వసతులు, అక్కడి పరిస్థితులైన సాక్షి విలేకరుల బృందం గురువారం ప్రత్యేక విజిట్ నిర్వహించింది. ఇందులో అనేక ఆసక్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పాఠశాలల విద్యార్థులు ప్రధానంగా తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల వాటి ప్రాంగణంలో చేతి పంపులు ఉండడంతో అక్కడి విద్యార్థులు ఉప్పునీటిని తాగి కడుపు నింపుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపోను మూత్రశాలలు, స్నానాల గదులు లేక ఆరుబయటకు వెళ్తున్నారు. ఆరుబయట నెలకొల్పిన కొన్ని భవనాలకు ప్రహరీలు లేక వారికి రక్షణ కరువైంది. కొన్నిచోట్ల ముఖ్యమైన సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయుల ఖాళీలు ఉండటంతో 9, 10 తరగతుల విద్యార్థులు చదువుల్లో వెనుకబడాల్సి వస్తోంది.
 
ప్రధాన సమస్యలివే..
- వటవర్లపల్లి ఆశ్రమ పాఠశాలలో నీటివసతి లేక రెండు కిలోమీటర్ల దూరంలో అడవికి సమీపంగా ఉన్న దిగుడు బావి వద్దకు వెళ్లి స్నానాలు చేస్తున్నారు. గురువారం ఇక్కడి ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు వర్కర్లకుగానూ ఒక్కరు మాత్రమే విధుల్లో ఉండటంతో విధ్యార్థులే వంట చేసుకోవాల్సి వచ్చింది.
- బాత్‌రూములలో వెలుతురు లేదు. రాత్రి సమయంలో చిన్న పిల్లలు ఆరుబయటకు వెళ్లాలంటే భయపడి పాఠశాల ఆవరణలోనే మలమూత్ర విసర్జన చేస్తున్నారు.
- బల్మూరు మండలంలోని చెంచుగూడెం బాలిక ఆశ్రమ పాఠశాలలో నాల్గవ తరగతికి చెందిన నవ్వ, నిఖితలు వీవ్ర జ్వరంతో బాధపడుతూ కనిపించారు. ఇక్కడి ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలల్లో నీటి వసతి సరిపడా లేని కారణంగా విద్యార్థినులు బహిర్భుమికి బయటకు వెళ్లాల్సి వస్తోంది.
- పలు బాలికల గురుకుల, ఆశ్రమ పాఠశాలల వద్ద రక్షణ లేకపోవడం, సంబంధిత సిబ్బంది బాధ్యతారాహిత్యం కారణంగా అమ్మాయిలకు ఆకతాయిల సమస్య ఎదురవుతోంది.

మరిన్ని వార్తలు