విధుల్లో చేరకపోతే.. వీధిలోకే!

19 Aug, 2018 01:29 IST|Sakshi
రంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న 108 ఉద్యోగులు

నేటి మధ్యాహ్నం 2 గంటల వరకు అవకాశం

తర్వాత తొలగిస్తామని జీవీకే ఈఎంఆర్‌ఐ సీవోవో అల్టిమేటం

బెదిరింపులకు వెరవబోమంటున్న ఉద్యోగులు

సాక్షి, హైదరాబాద్‌: అత్యవసర సేవల ఉద్యోగులకు అల్టిమేటం జారీ అయింది. విధుల్లో చేరకపోతే వీధుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమ్మెబాట వీడాలంటున్న సంస్థ.. ససేమిరా అంటున్న సిబ్బంది.. అటు‘108’సేవల సిబ్బంది, ఇటు జీవీకే ఈఎంఆర్‌ఐ.. మధ్యలో ఆపత్కాల రోగులు ఆగమాగమవుతున్నారు. ఎనిమిది గంటల పని కోసం ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న 108 సేవల విభాగం ఉద్యోగులకు జీవీకే ఈఎంఆర్‌ఐ అల్టిమేటం జారీ చేసింది.

ఇప్పటి వరకు సంస్థ నుంచి తొలగింపు పత్రాలు అందుకున్న ఉద్యోగులకు మానవతా దృక్పథంతో మరో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల్లోగా విధుల్లో చేరకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. విధుల్లో చేరనివారిని నిర్దాక్షిణ్యంగా తొలగించడమే కాకుండా సోమవారం వేతనాలు సెటిల్‌మెంట్‌ చేసి శాశ్వతంగా సంస్థ నుంచి బయటికి పంపేస్తామని ప్రకటించింది.

మరోవైపు యాజమాన్యం తాటాకు చప్పుళ్లకు తాము వెరువబోమని, హక్కులను సాధించుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని తెలంగాణ రాష్ట్ర 108 ఉద్యోగుల యూనియన్‌ స్పష్టం చేసింది. శనివారం రంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించి, జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈఎంటీలు, పైలట్ల సమ్మె వల్ల వాహనాలు స్తంభించి ఐదు రోజుల నుంచి అత్యవసర రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.  


తాటాకు చప్పుళ్లకు భయపడం 
మాకు ఎలాంటి చట్టాలు వర్తించవని జీవీకే ఈఎంఆర్‌ఐ యాజమాన్యం చెబుతోంది.  ఆ సంస్థను ఏ చట్టప్రకారం ఏర్పాటు చేశారో తెలపా లి. మా డిమాండ్లను పరిష్కరించకుండా యాజ మాన్యం మొండిగా వ్యవహరిస్తోంది. టెర్మినేట్‌ చేసిన ఉద్యోగులను శాశ్వతంగా తొలగిస్తామం టోంది. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు  భయపడం. 8 గంటల పని విధానాన్ని అమలు చేసే వరకు సమ్మె ఉపసంహరించబోం.   – పల్లె అశోక్, తెలంగాణ 108 ఉద్యోగుల యూనియన్‌ అధ్యక్షుడు

ఆ డిమాండ్లు మా పరిధిలో లేవు
సంస్థ పరిధిలో 1,787 మంది క్షేత్రస్థాయి, 73 మంది కాల్‌సెంటర్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది ఈ నెల 14 నుంచి సమ్మెలోకి వెళ్లారు. అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ఉద్యోగుల డిమాండ్లు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఈ విషయంలో మేం ఏమీ చేయలేం.

12 గంటలు పని చేయడానికి చాలా మంది ఉద్యోగులు సుముఖంగా ఉన్నారు. ఆ మేరకు కొంతమంది రాతపూర్వకంగా హామీ పత్రాలు కూడా ఇచ్చారు. సమ్మెలోకి వెళ్లి సంస్థ నుంచి టెర్మినేట్‌ నోటీసులు అందుకున్న ఉద్యోగుల్లో చాలా మంది మళ్లీ విధుల్లో చేరుతామంటున్నారు. మానవతా దృక్పథంతో వీరికి మరోసారి అవకాశం కల్పిస్తున్నాం. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే సరి..లేదంటే ఇంటికి పంపడం ఖాయం. – బ్రహ్మానందరావు, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్, జీవీకే ఎంఆర్‌ 108 సర్వీసుల విభాగం 

మరిన్ని వార్తలు