పింఛన్ అడిగితే దౌర్జన్యం చేశారు

22 Apr, 2015 02:43 IST|Sakshi

బాబూమోహన్‌కు వ్యతిరేకంగా జోగిపేటలో రాస్తారోకో
ఎమ్మెల్యే ఎవరిపై దౌర్జన్యం చేయలేదు: ఎస్సై

 
జోగిపేట : పింఛన్ అడిగిన కాంగ్రెస్ కార్యకర్తపై ఎమ్మెల్యే బాబూ మోహన్, ఆయన అనుచరుడు దౌర్జన్యం చేశారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ  మంగళవారం జోగిపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు.  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శివరాజ్ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

సోమవారం మండల పరిధిలోని నేరడిగుంట పంచాయతీ పరిధిలోని మక్తగూడెం వద్ద మిషన్ కాకతీయ పనులను బాబూమోహన్ ప్రారంభించి వెళుతుండగా నేరడిగుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త నర్సింలు ఎమ్మెల్యే వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించడంతో ఈ వివాదం తలెత్తినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట రాస్తారోకో చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి రాస్తారోకోను విరమింపజేశారు. అంతకు ముందు దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సింలును మాజీ ఎంపీపీ అధ్యక్షుడు హెచ్.రామాగౌడ్, మాజీ ఎంపీటీసీ మల్లయ్య, హరికృష్ణ తదితరులు పరామర్శించారు. 

కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనిల్‌రెడ్డి, నేరడిగుంట, మాసానిపల్లి గ్రామాల ఉప సర్పంచ్‌లు ప్రతాప్‌రెడ్డి, కృష్ణ,  మాజీ మార్కెట్ డెరైక్టర్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ విషయమై స్థానిక ఎస్సై వివరణ ఇస్తూ ఎమ్మెల్యే ఎవరిపై దౌర్జన్యం చేయలేదని, నర్సింలు ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తాము అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

>
మరిన్ని వార్తలు