చుట్టంలా వచ్చి చుట్టేసింది

4 Jun, 2019 09:54 IST|Sakshi
పంజగుట్ట: సహాయక చర్యల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది

నగరంలో భారీ వర్షం కూలిన చెట్లు  

విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు

రంగంలోకి జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలు   

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉండగా... సాయంత్రం దట్టమైన మేఘాలతో కారుచీకట్లు కమ్ముకున్నాయి. బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో చెట్లు కూలగా, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. నాంపల్లి, మల్లేపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, అమీర్‌పేట్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, సుచిత్ర, షాపూర్, పటాన్‌చెరు, రామచంద్రాపురం, అల్వాల్, తిరుమలగిరి, ఏఎస్‌రావునగర్, సైనిక్‌పురి, ఈసీఐఎల్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, అత్తాపూర్, నార్సింగి, రాజేంద్రనగర్‌లలో కుండపోత కురిసింది. మరోవైపు ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. భారీ వర్షం కురవడంతో జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి.

స్వల్ప వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఇంజినీరింగ్,మాన్‌సూన్‌ అత్యవసర బృందాలను మేయర్‌ రామ్మోహన్, కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ అప్రమత్తం చేశారు.జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌ ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి పరిస్థితులను సమీక్షించి నీటి నిల్వలున్న ప్రాంతాల్లో అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధాన ప్రాంతాల్లో జెట్‌ డీవాటరింగ్‌ మెషిన్లను ఏర్పాటు చేయడంతో రోడ్లపై నీరు నిల్వకుండా చేశారు. డయల్‌ 100, జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ ద్వారా అందిన ఫిర్యాదులను ఎమర్జెన్సీ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బృందాలు పరిష్కరించాయి. హబ్సిగూడ స్ట్రీట్‌ నంబర్‌ 5, చింతల్‌ బస్టాండ్, కుషాయిగూడ సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయం, లాలాపేట్‌ రామ్‌ థియేటర్, కుత్బుల్లాపూర్‌ జయరాంనగర్, మియాపూర్‌ స్వర్ణపురి కాలనీ, మల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్‌ క్రాస్‌రోడ్‌ వద్ద చెట్లు కూలినట్టు జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందింది. మధురానగర్‌లో చెట్టుకూలి కారుపై పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా... జీహెచ్‌ఎంసీ రెస్క్యూ బృందాలు సమస్యను పరిష్కరించాయి. నేరేడ్‌మెట్‌ రామ్‌బ్రహ్మానగర్, టోలీచౌకీ మహ్మదీయ లేన్‌లలో కూడా చెట్లు విరిగిపడినట్లు సమాచారం అందింది. ఈఎస్‌ఐ వద్ద చెట్టు కూలి విద్యుత్‌ స్తంభంపై పడడంతో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బృందాలు  వెంటనే విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి చెట్లను తొలగించాయి.

ఇదీ పరిస్థితి...  
సనత్‌నగర్‌ డివిజన్‌లో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ చెట్లు నేలకూలాయి. విద్యుత్‌ స్తంభాలు విగిరిపడ్డాయి. దీంతో కరెంటు సరఫరా నిలిచిపోయి అంధకారం అలుముకుంది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఎర్రగడ్డ ఎఫ్‌సీఐ సమీపంలో చెరువును తలపించేలా నీరు నిలవడంతో భరత్‌నగర్‌ ఫ్లైఓవర్‌పై రెండు వైపులా భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.   
తార్నాకలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లాలాపేట, అడ్డగుట్ట ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. అడ్డగుట్ట డివిజన్‌లోని నార్త్‌లాలాగూడ, శాంతినగర్, తుకారాంగేట్‌ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. అడ్డగుట్టలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఓయూ క్యాంపస్‌లో చాలా వరకు చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. ఆర్ట్స్‌ కాలేజీలోని ఎస్‌బీఐ బ్యాంక్‌కు వెళ్లే మార్గంలో చెట్టు కూలడంతో రాకపోకలు
నిలిచిపోయాయి.   
మల్కాజిగిరిలో హోర్డింగ్స్‌ కూలిపోయాయి. ఆనంద్‌బాగ్‌లో చెట్టు కూలి విద్యుత్‌ తీగల మీద పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. అధికారులు అర్ధరాత్రి వరకు సరఫరా పునరుద్ధరించారు. నేరేడ్‌మెట్, వినాయకనగర్‌ డివిజన్లలో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. డిఫెన్స్‌ కాలనీలో పార్కింగ్‌ చేసిన కారుపై భారీ చెట్టు పడడంతో ధ్వంసమైంది.  
మేడ్చల్‌లోనూ చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. ఉద్దమర్రి గ్రామంలో ఓ చెట్టు నేలకూలింది. కీసర మండలం భోగారం గ్రామంలో పిడుగుపడి పశువు మృతి చెందింది. రాంపల్లిదాయర గ్రామ సమీపంలో ఈదురు గాలులకు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నేలకూలింది.    
జూబ్లీహిల్స్‌ మ«ధురానగర్‌ ఎఫ్‌ బ్లాక్‌లో కొమ్మలు విరిగి కారుపై పడ్డాయి.  
ఉప్పల్‌ నియోజవకర్గంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉప్పల్, హబ్సిగూడ, నాచారం పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీఎస్‌ఐఐసీ కాలనీలో కారుపై చెట్టు పడింది. వేర్లు పైకి తేలి కారు పైకి లేచింది. నాచారం డివిజన్‌ పరిధి ఎరుకల బస్తీలోని అనరాసి రాములమ్మ, గఫర్, దుర్గేశ్‌ల ఇళ్ల పైకప్పులు ఎరిగిపోయాయి. బాబానగర్‌ చౌరస్తాలో ప్రహరీ కూలిపోయి ట్రాన్స్‌ఫార్మర్‌ మీద పడడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ భారీ శబ్దంతో పేలిపోయింది.   
అడిక్‌మెట్‌ డివిజన్‌లోని లలితానగర్‌లో చెట్టు కూలింది. ఈదురు గాలులకు బ్రేక్‌ డౌన్‌ కావడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  
పాతబస్తీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఛత్రినాక, ఉప్పుగూడ, గౌలిపురా, హరిబౌలి, బేలా, తలాబ్‌కట్టా రోడ్డు, సుల్తాన్‌షాహి, నషేమాన్‌నగర్, సిద్దిఖీనగర్, లలితాబాగ్‌ రైల్వే బ్రిడ్జి రోడ్డు, మీర్‌కా దయారా, బీబీబజార్‌ చౌరస్తా, యాకుత్‌పురా బడాబజార్‌ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.  
సుచిత్ర, కుత్బుల్లాపూర్, హెచ్‌ఎంటీ తదితర ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. చింతల్‌ ప్రధాన రహదారి రిడ్జ్‌ టవర్స్‌ గేటు వద్ద చెట్టు కూలిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.  

మరిన్ని వార్తలు