కోర్టుల్లో కాగితాలతో పని లేకుండా చేస్తున్నాం

16 Aug, 2018 03:32 IST|Sakshi
తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీజే రాధాకృష్ణన్‌.. తానే స్వయంగా సిబ్బంది, పోలీసులు, వీధిలోని పారిశుధ్య కార్మికులకు చాక్లెట్లు పంచారు

స్వాతంత్య్ర వేడుకల్లో హైకోర్టు సీజే రాధాకృష్ణన్‌ 

తెలుగు రాష్ట్రాల్లో న్యాయస్థానాల డిజిటైజేషన్‌ వేగవంతం 

అన్ని కోర్టుల్లో ఇంటర్నెట్‌.. కేసుల సమాచారం అప్‌లోడ్‌ 

న్యాయమూర్తుల భేటీ విషయాలు కూడా ఆన్‌లైన్‌లోనే

 హైకోర్టు తీర్పులూ అప్‌లోడ్‌ చేస్తున్నామన్న సీజే 

స్వయంగా చాక్లెట్లు పంచిన సీజే 

సాక్షి, హైదరాబాద్‌: కోర్టుల పరిపాలనలో కాగితాల ఫైళ్లతో పని లేకుండా చేస్తున్నామని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కోర్టుల కంప్యూటరీకరణకు చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా కోర్టు రికార్డుల కంప్యూటరీకరణ (డిజిటైజేషన్‌) పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని వెల్లడించారు. సబార్డినేట్‌ కోర్టులూ నేషనల్‌ జ్యుడీషియ ల్‌ డేటాగ్రిడ్‌కు అనుసంధానమయ్యాయని, ప్రతి కోర్టులో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించి కేసుల సమా చారాన్ని అప్‌లోడ్‌ చేయబోతున్నామని తెలిపారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం హైకోర్టు భవనంపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. నేషనల్‌ సాఫ్ట్‌వేర్‌ ఫ్లాట్‌ ఫాం ద్వారా జరుగుతున్న డేటాబేస్‌ రూపకల్ప నలో భాగంగా కక్షిదారులు, న్యాయవాదులు, న్యా యమూర్తులు బాలారిష్టాలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. న్యాయమూర్తుల సమావేశం విషయాలను ఆన్‌లైన్‌ ద్వారానే తెలియజేస్తున్నామని.. హైకోర్టు తుది తీర్పు, మధ్యంతర ఉత్తర్వులు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నామన్నారు. కింది కోర్టుల్లో జైళ్లలోని విచారణ ఖైదీలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారిస్తున్నామని వివరించారు.  

కింది కోర్టులకు భవనాలు 
గతేడాది రెండు తెలుగు రాష్ట్రాలు కొత్త కోర్టులను మంజూరు చేశాయని, దీంతో ముగ్గురు జిల్లా జడ్జీలు, 18 మంది సీనియర్‌ సివిల్‌ జడ్జీల పోస్టులను నేరుగా భర్తీ చేశామని జస్టిస్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. ఏపీలో రూ.160 కోట్ల వ్యయంతో 45 సబార్డినేట్‌ కోర్టు హా ళ్లు, రూ.2.65 కోట్లతో నాలుగు జడ్జీల నివాస భవనా లు నిర్మిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో 40 కోర్టు హాళ్లను రూ.25 కోట్లతో, జడ్జీల నివాస సముదా యం రూ.57 లక్షలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.  

ఏపీ తాత్కాలిక హైకోర్టు నిర్మాణంపై గోప్యమేల?: రామన్నదొర 
ఏపీలోని వెలగపూడిలో తాత్కాలిక హైకోర్టు భవనాలు నిర్మిస్తున్నారని ప్రచారం జరుగుతోందని, ఏపీ ప్రభుత్వం తమ సంఘాన్ని కనీసం సంప్రదించలేదని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామన్నదొర ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ న్యాయవాదులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారో తెలియదని, అరకొర సౌకర్యాలతో ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేస్తామంటే ఎలా వెళ్తామని ప్రశ్నించారు. 

జడ్జీల ఖాళీలు భర్తీ చేయాలి: ఏజీ 
రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించిందని, ఎంతోమంది న్యాయవాదులు స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ గుర్తు చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, రైతుబంధు లాంటి పథకాలతో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతోందని కొనియాడారు. రాజ్యాంగం సమానత్వాన్ని ఇచ్చిందని, త్యాగధనుల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ చెప్పారు. కోర్టుల్లో పెరుగుతున్న పెండింగ్‌ కేసులు తగ్గి సత్వర న్యాయం అందాలంటే ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సి.దామోదర్‌రెడ్డి కోరారు. 

కింది కోర్టుల పనితీరు భేష్‌ 
కింది స్థాయి కోర్టుల పనితీరు అద్భుతమని సీజే కొనియాడారు. సబార్డినేట్‌ కోర్టుల్లో 2017లో సివిల్, క్రిమినల్‌ కేసులు 7,23,502 దాఖలైతే.. పెండింగ్‌ కేసులు కలుపుకొని 7,60,582 పరిష్కా రమయ్యాయని, దీంతో 37,080 పెండింగ్‌ కేసు లు తగ్గాయని చెప్పారు. ఈ ఏడాది జూన్‌ చివరికి 3,69,462 కేసులు నమోదవగా 3,41,319 పరిష్కారమయ్యాయన్నారు. గతేడాది ఏపీలో 5 నేషనల్‌ లోక్‌ అదాలత్‌ల ద్వారా 1,05, 543 కేసులు, తెలంగాణలో 1,18,304 కేసులు పరిష్కరించామని, హైకోర్టులో లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ద్వారా వివిధ కేసుల్లో 1,249 మందికి రూ.21.45 కోట్లు పరిహారం చెల్లింపులకు ఆదేశాలిచ్చామన్నారు. హైకోర్టులో 2017లో 95,894 కేసులు నమోదవగా 62,047 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. ఈ ఏడాది జూలై 31 నాటికి 54, 686 కేసులను నమోదయ్యాయని 32,544 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. క్రిమినల్‌ అప్పీళ్ల పరిష్కారం కోసం దాదాపు ప్రతి శనివారం కోర్టు ప్రత్యేకంగా సమావేశం కావడం ద్వారా 104 అప్పీళ్లల్లో ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

మరిన్ని వార్తలు