ఒకే ఇంట్లో వారి పేర్లు వేర్వేరు వార్డుల్లోనా?

6 Jan, 2019 00:58 IST|Sakshi

ఓటర్ల జాబితాలో తప్పులపై హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసినంత మాత్రాన ఓటర్ల జాబితాకు పవిత్రత వచ్చినట్లు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో తప్పులకు ఆస్కారం లేనప్పుడే ఆ జాబితాకు పవిత్రత చేకూరుతుం దని తేల్చి చెప్పింది. నల్లగొండ జిల్లా గుర్రంపోడు గ్రామంలో ఒకే ఇంట్లో నివాసం ఉంటున్న కుటుం బీకులను వేర్వేరు వార్డుల్లో ఓటర్లుగా చూపడంపై విస్మయం వ్యక్తం చేసింది. ప్రస్తుత కేసులో ఎన్నికల కమిషన్‌ తన విధులను నిర్వర్తించడంలో విఫలమైనట్లు కనిపిస్తోందని విమర్శించింది.

గుర్రంపోడు గ్రామ ఓటర్ల జాబితాను సవరించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఓటర్ల జాబితా సవరణ గడువులోగా సాధ్యం కాకపోతే గుర్రంపోడు ఎన్నికను రీ షెడ్యూల్‌ చేసి రెండో దశ లేదా మూడో దశలోనైనా సవరించిన జాబితా ఆధారంగా నిర్వహించాలని కమిషన్‌కు తెలిపింది. ఎన్నికల ప్రక్రియ నిరాటం కంగా కొనసాగేందుకే ఈ విషయంలో తాము జోక్యం చేసుకుంటున్నామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ పి.వి.సంజయ్‌ కుమార్‌ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.  

మరిన్ని వార్తలు