మున్సిపల్‌ ఎన్నికల పోరు..లిక్కరు జోరు

18 Jan, 2020 10:44 IST|Sakshi

పండుగకు ముందు మూడ్రోజుల్లో 

ఏకంగా రూ.26.10 కోట్ల అమ్మకాలు

గత నెలతో పోల్చుకుంటే రెట్టింపు బేరాలు

సాక్షి, వైరా: ఈ మున్సిపల్‌ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని కొందరు అభ్యర్థులు మద్యాన్ని ఎరగా వేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా భారీగా కొనుగోలు చేసి నిల్వ ఉంచేశారు. నామినేషన్ల ఉపహసంహరణ సందర్భంగా ఈ నెల 13, 14వ తేదీల్లో అమ్మకాలు అమాంతం పెరిగాయి. ఆ తర్వాత 16తేదీతో కలుపుకుని ఏకంగా రూ.26.10కోట్ల విలువైన బీరు, లిక్కర్‌ అమ్మకాలు జరగడం దాని తీవ్రతను తెలియజేస్తోంది. సహజంగానే సంక్రాంతి పండుగప్పుడు లిక్కర్‌ అమ్మకాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.

ఈ తరుణంలో మున్సిపల్‌ ఎన్నికలు కూడా ఉండడంతో మరింత ఊపందుకున్నాయి. గత నెలతో పోల్చితే రెట్టింపునకు మించి బేరాలు సాగాయి. పండుగ 15వ తేదీ రాగా..అంతకుముందు రెండు రోజులు, 16వ తేదీన విక్రయాలు తారాస్థాయికి చేరాయి. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా పెట్టుకొని చకచకా పావులు కదుపుతున్నారు. ఓటర్లకు డబ్బులు పంచడం పక్కన బెడితే, మద్యం ఏరులై పారేలా పక్కా కిక్‌ ప్రణాళిక వేశారు. మందు ప్రియులను తమవైపు తిప్పుకొనుందుకు ఈపాటికే వారు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు.

ఆ తేదీల్లోనే ఎక్కువ..
14వ తేదీన నామినేషన్ల గడువు ముగిసింది. పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచేందుకు, కార్యకర్తలు, మద్యం ప్రియులను తమ వైపునకు తిప్పుకునేందుకు ఎక్కువగా మద్యం కొనుగోళ్లు చేశారు. ఉపసంహరణకు ముందు రోజున 13వ తేదీన కూడా కొని రహస్య ప్రదేశాలకు తరలించారు. పోటీకి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే తరుణం కావడంతో తమ బలం మరింత చాటుకునేలా..కొందరు కిక్కే..కిక్కు అంటూ పంపిణీ చేసినట్లు సమాచారం

రహస్య ప్రదేశాలకు తరలింపు..
ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, వైరా, మధిర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికలు ఈ నెల 22న జరగనున్నాయి. పోలింగ్‌కు ఒకట్రెంటు రోజుల ముందు పంపిణీ చేసేలా కొందరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పెద్ద ఎత్తున బీర్లు, మద్యాన్ని కొనుగోలు చేసి రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నారు. వైరా ఐఎంఎల్‌ మద్యం డిపోలో సందడి నెలకొంది.

ఎన్నికల నేపథ్యంలో కీలక ఘట్టానికి చేరుకుంటుండడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. మున్సిపాలిటీలోని వైన్స్‌ దుకాణాల నుంచి ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇంకా అదనంగా బార్లు, సమీప మండలాల నుంచి సరుకు పట్టుకెళ్లినట్లు సమాచారం.

నిఘా అధికారులు నిద్రపోతే..
ఎన్నికల పోరుకు మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో మద్యం జోరు మరింత పెరిగే అవకాశముంది. ఒకవేళ నిఘా అధికారులు పట్టించుకోకపోతే మాత్రం బీరు, లిక్కరు ఏరులై ప్రవహించే ప్రమాదముంది. కొంత మంది అభ్యర్థులు ఇప్పటి నుంచే మద్యాన్ని నిల్వ చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే అయినా..దాడులు కనిపించట్లేదు. నేరుగా ఓటర్ల ఇంటికెళ్లి పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నా..స్పందించట్లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

 

మరిన్ని వార్తలు