హైదరాబాద్‌ మెట్రోరైల్‌లో ఆ భయం లేదు..

17 Nov, 2017 11:37 IST|Sakshi

మెట్రతో నో టెన్షన్‌

దివ్యాంగులకు మెట్రో రైలులో సకల సౌకర్యాలు

స్టేషన్లలోనూ నో ప్రాబ్లం

సాక్షి, హైదరాబాద్‌ : విధి వక్రించి దివ్యాంగులుగా మారిన వారికి రైలు ప్రయాణమంటే కత్తిమీద సామే.. బస్సెక్కాలంటేనే ఆందోళన.. అలాంటిది రైలు ఎక్కాలంటే వారి ఇబ్బంది చెప్పనవసరం లేదు. ఎవరోఒకరు తోడుంటే తప్ప ప్రయాణం చేయలేరు. అయితే హైదరాబాద్‌ మెట్రోరైల్‌లో ఆ భయం అవసరం లేదు. ఈ ప్రాజెక్టులో ఇంజినీరింగ్‌ అద్భుతాలే కాదు..సామాజిక కోణం..ఆర్థిక కోణం..మానవీయ కోనం...ఇలా అన్ని వర్గాల వారు మన మెట్రో ..మన గౌరవం అన్న స్ఫూర్తితో ముందుకు సాగేందుకు అవకాశం కల్పిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద మెట్రో ప్రాజెక్టులను క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసిన తరవాత దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారులు..మహిళలు ఇలా అన్ని వర్గాల వారికి మెట్రో స్టేషన్లు,రైళ్లలో ప్రత్యేక వసతులు,సౌకర్యాలు కల్పించారు.

సౌకర్యవంతమైన ప్రయాణం..
వికలాంగులు, అంధులు, వినికిడి సామర్థ్యంలేనివారు, మాట్లాడలేని వారు కూడా ఎవరి సాయం లేకుండానే మెట్రో రైలులో సౌకర్యవంతంగా  ప్రయాణించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.  స్టేషన్‌ పరిసరాలు, టిక్కెట్‌ కలెక్షన్‌ గేట్లు, టిక్కెట్‌ జారీ యంత్రాల వద్ద దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

సుమధుర స్వరంతో అనౌన్స్‌మెంట్‌..
ఇక మీరు ఎక్కాల్సిన రైలు ఆగే ప్రదేశం..దిగాల్సిన స్టేషన్‌ వివరాలను నిరంతరాయంగా తెలియజేసేందుకు తెలుగు, ఇంగ్లిష్‌ హిందీ భాషల్లో అనౌన్స్‌మెంట్‌ వినిపించేందుకు ఏర్పాట్లుచేశారు. రోడ్‌లెవల్‌ నుంచి మొదటి అంతస్తు (స్టేషన్‌ మధ్యభాగం కాన్‌కోర్స్‌)కు చేరుకోగానే ప్రతీ ఒక్కరికీ అనౌన్స్‌మెంట్‌ మూడు భాషల్లో వినిపిస్తుంది. ఏదేని స్టేషన్‌ రాగానే బోగీ డోర్లు తెరచుకున్న..మూసుకున్న ప్రతీసారీ సుమధుర స్వరంతో మూడుభాషల్లో అనౌన్స్‌మెంట్‌  వినిపిస్తుంది. దీంతో ఎవరి సాయం అక్కరలేకుండానే ఎవ్వరైనా మెట్రో జర్నీ చేయవచ్చు.

వీల్‌చైర్లకు ప్రత్యేక ర్యాంపులు
రోడ్‌లెవల్‌ నుంచి నేరుగా ప్లాట్‌ఫారం మీదకు వీల్‌చైర్‌లో వెళ్లేందుకు ప్రతీ స్టేషన్‌ వద్ద ప్రత్యేకంగా ర్యాంపులు నిర్మించారు. అంతేకాదు వీల్‌చైర్‌తో సహా లిఫ్టులో ప్రయాణించేందుకు ప్రతి స్టేషన్‌ వద్ద విశాలమైన లిఫ్టులు ఏర్పాటుచేశారు. ఇక వీల్‌చైర్‌లో వెళ్లే ప్రయాణీకులు నేరుగా బోగీలోకి చేరుకునేందుకు ప్లాట్‌ఫాంకు.. ట్రాక్‌ను సమాన ఎత్తులో ఏర్పాటు చేశారు. తద్వారా వీల్‌చైర్‌తో నేరుగా భోగీలోకి వెళ్లి సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణించవచ్చు. ఇక బోగీలోనూ ప్రత్యేకంగా గ్రాబ్‌హోల్డ్‌లను ఏర్పాటుచేశారు. దీనికి వీల్‌చైర్‌ను లాక్‌చేయవచ్చు. ఇక వీరు వీల్‌చైర్‌తో సహా టాయిలెట్‌కు వెళ్లేందుకు ప్రత్యేకంగా ప్రతి స్టేషన్‌లో టాయిలెట్లను ఏర్పాటు చేశారు.

అంధుల కోసం...
బ్రెయిలీ లిపిలో లిఫ్టు బటన్‌లను ఏర్పాటుచేశారు. ఇక తమ చేతిలో ఉన్న ఎలక్ట్రానిక్‌ కర్ర సాయంతో ప్లాట్‌ఫారం పైకి చేరుకునేందుకు ప్రత్యేకమైన టైల్స్‌తో మార్గం ఏర్పాటు చేశారు. అంధులు ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాంపై కిందపడకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు,సౌకర్యాలు కల్పించారు.

నిరక్షరాస్యుల కోసం..
స్వల్ప దృష్టిలోపం ఉన్నవారు..నిరక్షరాస్యులు సైతం స్టేషన్‌లో వివిధ ప్రాంతాలకు, స్టోర్లకు వెళ్లేందుకు సూక్ష్మచిత్రాలు (పిక్టోగ్రామ్స్‌)తో ఏర్పాటుచేసిన సైనేజి బోర్డులు, రేడియం బోర్డులు ఉపయుక్తంగా ఉంటాయి. వారు ఎవరి సాయం లేకుండానే ఈ చిత్రాలను వీక్షించి తాము కోరుకున్న ప్రాంతానికి వెళ్లవచ్చు.  

మెట్రో  క్యా బాత్‌హై
రాళ్లెత్తిన కూలీలు..18 వేలు...
మెట్రో నిర్మాణానికి సుమారు 18 వేల మంది కార్మికులు సుమారు ఐదేళ్లపాటు అహరహం శ్రమించడంతో కలల మెట్రో ప్రాజెక్టు సాకారమైంది. ఒరిస్సా, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్, ఏపీకి చెందిన వేలాదిమంది కార్మికులకు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ఉప్పల్, మియాపూర్‌ మెట్రో డిపోల్లో ప్రత్యేకంగా ఆరునెలల పాటు శిక్షణనిచ్చి నైపుణ్యం గల కార్మికులుగా తీర్చిదిద్దింది. ఇందులో బార్‌బెండర్స్, వెల్డర్స్, ఇతర నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యే కార్మికులున్నారు. వీరందరికీ....వసతి,భోజన,వైద్య సౌకర్యాలు సైతం డిపోలోనే కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా వారికోసం వసతిసముదాయాలను తాత్కాలికంగా ఏర్పాటుచేసింది. వీరంతా మూడు షిఫ్టులవారీగా పనుల్లో నిమగ్నమయ్యారు. ఎక్కడా ప్రమాదాలు జరగకుండా అంతర్జాతీయ ప్రమాణాల మేరకు భద్రతా ఏర్పాట్లు,కార్మికులకు సేఫ్టీ ఉపకరణాలు అందజేశారు.

మరిన్ని వార్తలు