నానీ.. లే తల్లి...నాన్నకు ఫోనెప్పుడు చేస్తావు

6 Jan, 2020 04:17 IST|Sakshi

కుమార్తె మృతదేహం చూసి తల్లిదండ్రుల రోదనలు

శోకతప్త హృదయాలతో చరితారెడ్డి అంతిమయాత్ర

నేరేడ్‌మెట్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు

నేరేడ్‌మెట్‌: ‘నానీ లే తల్లి..బిడ్డా లేమ్మా...నాన్నకు ఫోనెప్పుడు చేస్తావు..తమ్ముడికి ఇక జాగ్రత్తలు ఎవరు చెప్తారు...తాతను పేరుపెట్టి ఎవరు పిలుస్తారమ్మా... గొప్ప దానివవుతావని చెప్పావు..ఇక కనిపించకుండా వెళ్లిపోతున్నావా తల్లీ...మేమేం పాపం చేశాం దేవుడా..మాకు కడుపుకోత మిగిల్చావు’అంటూ యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఎల్ల చరితారెడ్డి మృతదేహం చూసిన తల్లిదండ్రులు శోభ, చంద్రారెడ్డిలు గుండెలవిసేలా రోదించారు. డిసెంబర్‌ 27న అమెరికాలోని మిచిగావ్‌ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చరితారెడ్డి దుర్మరణం చెందారు. అక్కడ ఆమె గుండె, కాలేయం, మూత్రపిండాలు, నేత్రాలు చావుబతుకుల మధ్య ఉన్న తొమ్మిది మందికి అవయవదానం చేశారు.అనంతరం అమెరికాలో భారతీయ రాయబార కార్యాలయం అనుమతి(ఎన్‌ఓసీ)తీసుకొని అక్కడి నుంచి ఆదివారం ఉదయం 8.30గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చరితారెడ్డి మృతదేహం తెచ్చారు.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, చరితారెడ్డి బంధువులు, పలువురు కార్పొరేటర్లు ఎయిర్‌పోర్ట్‌ వద్దకు చేరుకొని, సంబంధిత అధికారులతో మాట్లాడారు. అంబులెన్స్‌లో ఉదయం 11గంటలకు నేరేడ్‌మెట్‌ రేణుకానగర్‌లోని ఆమె ఇంటికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. కుమార్తె మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు,కుటుంబీకులు భోరున విలపించారు. నేరేడ్‌మెట్‌ భరణి కాలనీలోని శ్మశాన వాటికలో తండ్రి చంద్రారెడ్డి కుమార్తె చితికి నిప్పంటించి అంతిమ క్రియలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సుమతీమోహన్, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్‌ సంధ్య, వివిధ పార్టీల నాయకులు,కార్పొరేటర్లు, సన్నిహితులు చరితారెడ్డికి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు