వేధింపులపై మౌనం వీడండి 

25 Jan, 2020 01:32 IST|Sakshi
కవయిత్రులతో ఐజీ స్వాతి లక్రా, ఎస్పీ సుమతి

యువతులకు ఐజీ స్వాతి లక్రా సూచన 

సాక్షి, హైదరాబాద్‌ : సమాజంలో జరుగుతున్న వేధింపులను మౌనంగా భరించవద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఐజీ స్వాతి లక్రా యువతులకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని కస్తూర్బా గాంధీ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శుక్రవారం విమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో హితైషి కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వం షీ టీమ్స్‌ పోకిరీల పని పడుతోందని చెప్పారు. ఇటీవల ఐదో వార్షికోత్సవం సందర్భంగా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమా జాన్ని చైతన్యపరిచేలా మహిళా రచయితలు రాసిన కవితలను సంపుటిగా వెలువరించడం ఆనందం గా ఉందన్నారు. నేటి కాలం యువతులు ఎడ్యుకేషన్, గేమింగ్‌ యాప్‌లతోపాటు హాక్‌–ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు.

ఆపదలో డయల్‌ 100కి ఫోన్‌ చేయాలని, భరోసా కేంద్రాలను సంప్రదించాలన్నారు. చాలా కేసుల్లో తాము బాధితుల పేర్లు వెల్లడించకుండా కేసులు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. వేధింపులపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులకు అవగాహన పెంచేందుకు కళాశాలల్లో విద్యార్థులతోనే కమిటీ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఎస్పీ సుమతి మాట్లాడుతూ సమాజంలో విద్య, సమానత్వం, లింగ వివక్షలను రూపుమాపేందుకు 30 మంది కవయిత్రులు రాసిన కవితలు గొప్ప స్ఫూర్తిని చాటాయన్నారు. అనంతరం శ్రీవల్లి రాసిన వీడియో చైతన్య గీతాన్ని విడుదల చేశారు.

మరిన్ని వార్తలు