చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ‘వాట్సప్’లో సమాచారమివ్వండి

14 Feb, 2015 03:48 IST|Sakshi
చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ‘వాట్సప్’లో సమాచారమివ్వండి

సాంకేతిక విప్లవాన్ని సర్కారు విభాగాలు అందిపుచ్చుకుంటున్నాయి. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల హవా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రభుత్వం యంత్రాంగం సైతం విధి నిర్వహణలో వాటి వినియోగానికి ప్రాధాన్యమిస్తోంది. సాధారణంగా ఒక విషయంపై ఫిర్యాదు చేయాలంటే సదరు బాధితులు కార్యాలయానికి వచ్చి.. లిఖితపూర్వకంగా ఇవ్వడానికి సమయం పడుతుంది. కానీ సామాజిక మాధ్యమాల వినియోగంతో తక్షణమే ఫిర్యాదును సంబంధిత ఆధారాలతో అందజేయవచ్చు.

ఈ నేపథ్యంలో జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ప్రత్యేక ఖాతాలు తెరిచి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే వాటిని వినియోగంలోకి తెచ్చిన పలువురు అధికారులు.. సరైన ఆధారాలు సమర్పించి ప్రభుత్వానికి సహకరించే వారికి రివార్డులు సైతం ఇస్తున్నారు.


పాలనకు సాంకేతిక పరిజ్ఞానం జోడించిన అధికారులు
* అక్రమాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త వ్యూహం
* వాట్సప్, మెయిల్స్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
* ఆధారాలు పంపినవారికి రివార్డులు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: శాంతిభద్రతల అంశంలో సత్వరం స్పందించేందుకు గ్రామీణ పోలీసు విభాగం సామాజిక మాద్యమబాట పట్టింది. ఏదైనా సంఘటనకు సంబంధించి బాధితులు, ప్రత్యక్ష సాక్షులు ఫొటోలు, వీడియోలు లేదా వాయిస్ మెసేజ్ చేసిన మరుక్షణమే రంగంలోకి దిగేందుకు ఉపక్రమించింది. మెసేజ్ వచ్చిన మరుక్షణమే బాధితులకు సాయం అందించడంతోపాటు కారకులపై చట్టపరమైన చర్యలకు దిగుతామని ఎస్పీ శ్రీనివాస్ స్పష్టం చేశారు.
 వాట్సప్ నంబర్లు: 80083 84500, 80083 84600
 
రాజధానికి ఆనుకుని జిల్లా ఉండడంతో రెవెన్యూ పరమైన సమస్యలు సైతం అధికంగా ఉంటాయి. విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారులనుంచి కాపాడేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమార్కుల భరతం పట్టడానికి జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్ సైనీ సామాజిక మాద్యమాన్ని ఎంచున్నారు. వాట్సప్, ఈ- మెయిల్‌తో అక్రమాలకు ముకుతాడు వేయాలని నిర్ణయించి.. ప్రజలకు వాట్సాప్ నంబర్‌ను, మెయిల్ ఐడీని అందుబాటులోకి తెచ్చారు. వీటిద్వారా సమాచారమిచ్చిన వెంటనే యంత్రాంగం స్పందించి అక్రమార్కులపై ఉక్కుపాదం మొపనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ఫేస్‌బుక్ ఖాతాను కూడా తెరువనున్నట్లు ఆయన వెల్లడించారు.
వాట్సప్ నంబర్: 98499 04205
 
ప్రజా పంపిణీ వ్యవస్థ, వైద్య, ఆరోగ్యం, విద్య తదితర కీలక విభాగాల్లో అక్రమాలను అరికట్టేందుకు జాయింట్ కలెక్టర్ -2 కాట ఆమ్రపాలి వాట్సాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకతే లక్ష్యంగా సామాజిక మాద్యమాన్ని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఈమెయిల్ ఐడీకి సైతం సమాచారం ఇచ్చేలా ఏర్పాటు చేశారు.
వాట్సప్ నంబర్ : 90005 44132
 
ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న నేపథ్యంలో ఈ అక్రమాల్ని అరికట్టేందుకు వికారాబాద్ సబ్‌కలెక్టర్ అలగు వర్షిణి కూడా వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా అక్రమాలపై ఆధారాలను పోస్ట్ చేసే వారికి తగిన బహుమతులు సైతం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
వాట్సప్ నంబర్ : 98499 04208
 
రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన తాండూరులో అక్కడి పోలీస్ విభాగం వాట్సప్, ఫేస్‌బుక్ ఖాతాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల తాండూరు ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చందనదీప్తి.. ఈవ్‌టీజింగ్, మట్కా, జూదం, ఇసుక అక్రమ రవాణా తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
వాట్సప్ నంబర్: 9440627353

>
మరిన్ని వార్తలు