7న పారిశ్రామిక విధాన ప్రకటన

26 May, 2015 01:31 IST|Sakshi
7న పారిశ్రామిక విధాన ప్రకటన

నూతన విధానానికి తుది రూపుపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
నేటి కేబినెట్ సమావేశంలో ఆమోదించే అవకాశం

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని జూన్ 7న ప్రకటించేలా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ముహూర్తం నిర్ణయించారు. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తెస్తామంటూ తొలి నుంచి చెబుతున్న ఆయన.. నూతన విధానానికి తుది రూపు ఇచ్చేందుకు సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు బి.వి.పాపారావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్‌తోపాటు టీఎస్‌ఐఐసీ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జెన్‌కో, వివిధ ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.
 
దేశంలోని పేరొందిన పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు, బహుళజాతి కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖుల సమక్షంలో నూతన విధానాన్ని ప్రకటించాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నూతన విధానం రూపకల్పనపై కసరత్తు జరిగిన తీరును విశ్లేషించారు. ‘పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి 15 రోజుల్లోనే అనుమతులు ఇవ్వడం ఈ విధానం ప్రత్యేకత. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాల కల్పన బాధ్యత ప్రభుత్వానిదే’నని సమావేశంలో సీఎం స్పష్టీకరించారు.
 
 టీఎస్‌ఐఐసీ ద్వారా భూ కేటాయింపు
 రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) ద్వారానే పారిశ్రామిక అవసరాలకు భూమి కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. ‘టీఎస్‌ఐఐసీకి ప్రభుత్వం 1.60 లక్షల ఎకరాలు బదిలీ చేసింది. టీఎస్‌ఐఐసీ అధీనంలోని భూముల్లో మౌలిక సౌకర్యాలను కల్పించి, పారిశ్రామికేతర అవసరాలకు బదలాయించకుండా షరతులు విధిస్తామని’ సీఎం స్పష్టం చేశారు. ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో పారిశ్రామికవాడల్లో సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
 
 అనుమతులు, తనిఖీల పేరిట కాలయాపన చేసే విధానాలకు స్వస్తి చెప్తామన్నారు. ‘వాటర్‌గ్రిడ్ ద్వారా 10 శాతం నీటిని పారిశ్రామిక అవసరాలకు కేటాయించాం. వచ్చే ఏడాది మార్చి నాటికి 7 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సీఎం కార్యాలయంలోని చేజింగ్ సెల్ దరఖాస్తుదారులతో ముఖాముఖి జరిపి 15 రోజుల్లో అనుమతులు ఇస్తుంది’ అని సీఎం ప్రకటించారు. కాగా నూతన పారిశ్రామిక విధానానికి మంగళవారం జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
 
 30న గుట్ట అభివృద్ధికి శంకుస్థాపన
 యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అధారిటీ అధ్వర్యంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వ శ్రీకారం చుడుతోంది. ఈ నెల 30న సీఎం కేసీఆర్ గుట్టలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. గవర్నర్ నరసింహన్‌తో పాటు చినజీయర్‌స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం బుధవారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు బయల్దేరుతున్నారు. ఈనెల 28న అక్కడ జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొంటారు.

మరిన్ని వార్తలు