పోలీసు కస్టడీకి ఐసిస్ సానుభూతిపరుడు

30 Jun, 2017 16:34 IST|Sakshi
పోలీసు కస్టడీకి ఐసిస్ సానుభూతిపరుడు

హైదరాబాద్: ఐసిస్ సానుభూతిపరుడు, కృష్ణ జిల్లాకు చెందిన సుబ్రమణ్యం అలియాస్ ఒమర్ ను విచారించేందుకు సిట్ పోలీసులు ఏడు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఆయన 14 రోజుల రిమాండ్ఽలో ఉన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనే సమాచారం మేరకు ఈనెల 23న టోలిచౌక్ వద్ద సిట్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. సుబ్రమణ్యం డిగ్రీ చదువుతున్న సమయంలో ముస్లిం స్నేహితుల స్పూర్తితో మతం మార్పిడి చేసుకుని గుజరాత్ నుంచి వచ్చిన మత ప్రచారకులతో కలిసి వెళ్లిపోయాడు.

సిద్దాపూర్లో మదర్సాలో చేరి సుమారు తొమ్మిది నెలలపాటు మత గ్రంథాలను అధ్యయంన చేశాడు. కొన్ని రోజుల తర్వాత తన స్వగ్రామం వెళ్లి తండ్రితో గొడవపడి బాలనగర్‌లో సోడా వ్యాపారం చేశాడు. ఐసిస్ చీఫ్ అబూ ఖలీఫా ఆల్ హింద్ ఆదేశాల మేరకు దేశంలో వివిధ ప్రాంతాల్లో కుట్రపన్నాడు. సాంఘిక మాధ్యమాల ద్వారా ఐసిస్ కార్యకలాపాలు కొనసాగిస్తూ రెండు సంవత్సరాల్లో సుమారు ఐదువేల మందితో మాట్లాడాడు. ఇరాక్, ఇరాన్, దుబాయ్ వంటి ఇతర దేశాలలో  ఉండే ఉగ్రవాదులతో నేరుగా మాట్లాడేవాడు. కృష్ణా జిల్లా తదితర ప్రాంతాల్లో ఉన్న అతని స్నేహితులపై పోలీసులు అరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు