‘తెలుగు తప్పనిసరి’ అమలయ్యేనా? 

19 Mar, 2018 01:38 IST|Sakshi

వచ్చే ఏడాది అమలుపై అధికారుల్లో అనుమానాలు 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై విద్యా శాఖ అధికారులు ఆలోచనల్లో పడ్డారు. తెలుగు అమ లుపై డ్రాఫ్ట్‌ బిల్లును రూపొందించి ప్రభుత్వానికి పంపించినా, ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో దానిపై చర్చ జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతారా? లేదా? అన్న దానిపై అధికారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాతృభాష అమలుపై  తెలుగు వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ సత్యనారాయణ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మాతృ భాష అమలుపై కమిటీ అధ్యయనం జరిపింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) అధికారులతోనూ మాట్లాడి సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లలో అమలుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతోపాటుగా పాఠ్య పుస్తకాల రూపకల్పనపైనా దృష్టి సారించింది. పదో తరగతి వరకు ఇంగ్లిషులో చదువుకుని ప్రస్తుతం ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని వారి కోసం పుస్తకాల రూపకల్పనకు చర్యలు చేపట్టింది. 2018–19 విద్యా ఏడాదిలో తెలుగును అమలుకు అవసరమైన నిబంధనలపై ముందడుగు పడటం లేదు. ఈ నేపథ్యంలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేస్తారా? లేదా? అన్న దానిపై అధికారుల్లోనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు