దత్తతకు చార్మినార్‌, గోల్కొండ కోట..

2 May, 2018 17:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ‘అడాప్ట్‌ ఏ హెరిటేజ్‌’ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ ఎర్రకోటను దాల్మియా భారత్‌ కంపెనీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోకి ఇప్పుడు జీఎమ్‌ఆర్‌, ఐటీసీ హోటల్స్‌ కూడా చేరాయి. ఈ క్రమంలో ఐటీసీ కంపెనీ 400 ఏళ్ల నాటి చారిత్రక కట్టడం, హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న చార్మినార్‌ను దత్తత తీసుకోవడం కోసం ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈఓఐ)ను దాఖలు చేసింది. చార్మినార్‌ దత్తత కోసం ఐటీసీకి పోటీగా మరే ఇతర కంపెనీ పోటీ పడకపోవడంతో ఐటీసీ దరఖాస్తును విజన్‌ కమిటీ, ఒవర్‌నైట్‌ కమిటీ ఆమోదించాయి.

అలానే జీఎమ్‌ఆర్‌ స్పోర్ట్స్‌ ఈ ‘అడాప్ట్‌ ఏ హెరిటేజ్‌’ కార్యక్రమంలో భాగంగా మొత్తం ఏడు చారిత్రక కట్టడాల దత్తత కోసం దరఖాస్తు చేసింది. వాటిలో ఢిల్లీలోని ఎర్రకోట, గోల్కొండ కోట కూడా ఉన్నాయి. దీని గురించి జీఎమ్‌ఆర్‌ స్పోర్ట్స్‌ కంపెనీ అధికారులు ‘ మేము గోల్కొండ కోట కోసం వేసిన బిడ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఒకవేళ మా బిడ్‌ కమిటీకి నచ్చి, మాకు గోల్కొండ కోటను కేటాయిస్తే అప్పుడు మేము ప్రభుత్వంతో ఒక ఎమ్‌వోయూను ​కుదుర్చుకుంటాము’ అని తెలిపారు. జీఎమ్‌ఆర్‌ స్పోర్ట్స్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టుకు ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే.

‘అడాప్ట్‌ ఏ హెరిటేజ్‌’ :...
చారిత్రక కట్టడాల సంరక్షణతో పాటు పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం 2017, సెప్టెంబరులో ‘అడాప్ట్‌ ఏ హెరిటేజ్‌’ కార్యక్రమం ప్రారంభింది. ఈ దత్తత కార్యక్రమంలో భాగంగా దాదాపు 100 చారిత్రక కట్టడాల పేర్లను ప్రకటించింది. తాజ్‌మహల్‌, ఎర్రకోట, సూర్య దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్‌ వంటి చారిత్రక కట్టడాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశం పర్యటక రంగంలో కార్పొరేట్‌ సంస్థలను భాగస్వామ్యం చేసి ఆయా చారిత్రక కట్టడాలను సంరక్షించడం. చారిత్రక కట్టడాల దత్తత కార్యక్రమంలో భాగంగ కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తుంది. అత్యధిక బిడ్‌ వేసిన కంపెనీలకు ఈ చారిత్రక కట్టడాలను కేటాయిస్తారు. ఇక రానున్న ఐదేళ్లపాటు ఆయా చారిత్రక కట్టడాల సంరక్షణ బాధ్యత ఆ కంపెనీలదే.

ఈ కార్యక్రమం అమలులో భాగంగా ఎర్రకోటను దత్తత చేసుకోవాడానికి దాల్మియా భారత్‌ గ్రూపు, ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు పోటీ పడగా... చివరకు ఈ రేసులో దాల్మియా భారత్‌ కంపెనీ 25 కోట్ల రూపాయల  టెండర్‌ వేసి ఎర్రకోటను దక్కించుకుంది. ఇకమీదట ఎర్రకోట సంరక్షణ బాధ్యతలతో పాటు ఎర్రకోటకు వచ్చే పర్యాటకుల బాధ్యత కూడా ఇక దాల్మియానే చూసుకోనుంది.

ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈఓఐ) :
ఏదైనా వ్యాపారంలో భాగస్వామి అయ్యేందుకు లేదా ఉద్యోగం చేసే ఉద్ధేశంతో ఒక కంపెనీ లేదా పెట్టుబడిదారు పోటీ పడటం.

మరిన్ని వార్తలు