అప్పులు బీసీలకు.. సంపద అగ్రవర్ణాలకా? 

11 Sep, 2019 03:38 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌. చిత్రంలో జస్టిస్‌ ఈశ్వరయ్య తదితరులు

రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు కోత సరికాదు 

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల 

నాంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు కోత విధించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. సంక్షేమ రంగంలో 48 శాతం కోత విధించడం బాధాకరమని అన్నారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో బీసీలకు రూ.5,960 కోట్లు కేటాయిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.2,672 కోట్లు మాత్రమే కేటాయించారని ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో బీసీ సబ్‌ప్లాన్‌ ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరేళ్లలో రెండు లక్షల 20 వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకువచ్చారని ఆరోపించారు. అప్పులు బీసీలకు, ఆర్థిక సంపద అగ్రవర్ణాలకా? అని నిలదీశారు. జోగు రామన్న ఏ పాపం చేశారని మంత్రివర్గంలోకి తీసుకోలేదు? సకల జనుల సమ్మెను నడిపిన స్వామిగౌడ్‌ ఎక్కడికి పోయారు? ఆత్మబలిదానం చేసుకున్న దాసోజు కుటుంబం ఎక్కడికి పోయింది? అని ప్రశ్నించారు. మంగళవారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో జాజుల మాట్లాడారు.

తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇరువురు నేతలను గవర్నర్‌లుగా నియమించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు ఆయన బీసీ సంఘాల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటిస్తోందని అన్నారు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉదయం 10 గంటలకు హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్‌లకు ఆత్మీయ సత్కార అభినందన సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ ఎంబీసీ అధ్యక్షుడు బంగారు నర్సింహ సాగర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంచార జాతుల సంఘం అధ్యక్షులు పోల శ్రీనివాస్, వెంకటనారాయణ, విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షుడు బండి సాయన్న, వీర భద్రయ్య సంఘం అధ్యక్షులు వీరస్వామి, ప్రొఫెసర్‌ ఆలెదాసు జానయ్య, విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి రంగాచారి, దూదేకుల సంఘం అధ్యక్షుడు షేక్‌ సత్తార్‌ సాహెబ్, గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీహరి యాదవ్, కురుమ సంఘం నాయకులు సదానందం, కనకల శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.  

‘ఐకమత్యం పెరిగింది’
వెనుకబడిన తరగతుల్లో ఐకమత్యం వచ్చిందని జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య అన్నారు. ఐకమ త్యం పెరగడంతోనే మంత్రివర్గంలోని మం త్రులకు ఉద్వాసన పలకడానికి ప్రభుత్వం వెనుకడుగు వేసిందన్నారు. బీసీలపై చర్య తీసుకుంటే  పీఠాలకే ఎసరు పెట్టినట్లు అవుతుందనే భయం పాలకవర్గంలో ఉందన్నారు. తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్రానికి రావడం కొత్త రాజకీయ నాందికి ఆరంభమని అన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన గవర్నర్‌గా తెలంగాణకు రావడం అదృష్టంగా భావించాలని అన్నారు.  

మరిన్ని వార్తలు