కవ్వాల్ వైపు పులి అడుగులు

20 Feb, 2015 04:40 IST|Sakshi
కవ్వాల్ వైపు పులి అడుగులు

జన్నారం : అటవీ శాఖ అధికారులు ఎదురుచూస్తున్న పులి జాడ ఎట్టకేలకు జిల్లాలో కనిపించింది. జిల్లాలో ఐదు పులులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగజ్‌నగర్, బెజ్జూర్, సిర్పూర్, చెన్నూర్ అటవీ ప్రాంతాల్లో నాలుగు పులులు ఉన్నట్లు గుర్తించారు. మంచిర్యాల అట వీ ప్రాంతంలో మరో పులి జాడ ఉన్నట్లు అక్కడ లభించిన అడుగుల ద్వారా తెలుస్తోంది. ఈ పులులను కవ్వా ల్ అభయారణ్యానికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. వారం రోజులుగా అధికారులు అమర్చిన కెమెరాలకు పులి అడుగుజాడలు చిక్కడంతో ఆయూ ప్రదేశాల్లో ఉన్నట్లుగా హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ చైర్మన్ ఇమ్రాన్ సిద్ధిఖి తెలిపారు.

ఆ ప్రాంతంలో కన్నా కవ్వాల్ అభయారణ్యంలోకి పులులు వస్తే వాటికి అనువుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగీ, తిర్యాణి అటవీ ప్రాంతం నుంచి కవ్వాల్ అభయారణ్యంలోకి పులి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతంలో అడవులు నరికివేతకు గురికావడంతో పులికి అనువుగా లేనందున.. కవ్వాల్ అభయారణ్యానికి రాలేకపోతోందని అధికారుల అభిప్రాయం. ఆసిఫాబాద్ అటవీ డివిజన్‌లో అడవులు నరికివేతకు గురవడం, అక్కడే అడ ప్రాజెక్ట్ నిర్మాణం కావడం, కాలువల నిర్మాణం జరగడంతో పులి అక్కడి నుంచి తిరిగి బెల్లంపల్లి, మంచిర్యాల అటవీ ప్రాంతాల్లో తిరుగుతోందని అధికారులు అంటున్నారు.

పులి రాకకు ఎలాంటి అలజడి లేకుండా ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. తాడోబా నుంచి నేరుగా కవ్వాల్ అభయారణ్యానికి రావడానికి మధ్యగల కారిడర్ అంతరాయంగా ఉండడం వల్ల పులి కవ్వాల్‌కు రాలేకపోతోంది. అడవిలో చెట్లు పెంచడం, వ్యవసాయ పనులు జరగకుండా చర్యలు తీసుకోవడం వంటి అభివృద్ధి పనులు సీఏ ల్యాండ్ నిధులతో చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. కవ్వాల్ అభయారణ్యాన్ని పులుల రక్షిత ప్రదేశంగా మార్చిన నుంచి పులుల రాక కరువైంది. ఐదు పులులు జిల్లాలో పలు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు కెమరాల ద్వారా బయట పడడంతో కొంత ఊరటనిస్తోంది.

ఆ పులులు కవ్వాల్ వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటు అటవీశాఖ అధికారులు, అటు హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సభ్యులు పులులను కవ్వాల్‌కు పంపేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కవ్వాల్ అడవుల్లో పులులకు తగినంత ఆహారం, అడవి, ఆవాసాలు ఉన్నందుకు ఇక్కడికి వస్తే తిరిగి తాడోబాకు వెళ్లే అవకాశం ఉండదని డీఎఫ్‌ఓ దామోదర్‌రెడ్డి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
 
అలజడి లేకుండా చూడాలి : ఇమ్రాన్‌సిద్ధిఖి
తాడోబా నుంచి కవ్వాల్ అటవీ ప్రాంతానికి పులి వచ్చే కారిడార్‌ను అలజడి లేకుండా చూస్తే తప్పకుండా వస్తుంది. గతంలో కారిడార్‌లో అడవులు నరికివేతకు గురయ్యాయి. దీంతో పులి భయంతో ఆ దారి వెంట రావడం లేదు. ఆ ప్రాంతంలో అలజడి లేకుండా చూస్తే పులి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు