కరోనా తెచ్చిన తంటా

26 Jun, 2020 13:11 IST|Sakshi
లీకవుతున్న ఆయిల్‌ ప్యాకెట్‌ కాలం చెల్లిన రాగిమాల్ట్‌

పిండిలో పురుగులు.. ఆవిరవుతున్న ఆయిల్‌

కేజీబీవీల్లో నాణ్యత కోల్పోతున్న సరుకులు

మంచిర్యాలఅర్బన్‌: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో నిల్వ ఉంచిన సరుకుల నాణ్యతపై కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం చూపుతోంది. మార్చి 22న జనతాకరŠూప్య నుంచి ఆశ్రమ, మోడల్‌స్కూల్, రెసిడెన్సియల్‌ పాఠశాలు మూసివేసిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి చెందుతుండటంతో పాఠశాలలు తెరుచుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి. నెలలు గడిచిపోతుండటం.. ఇంకోవైపు విద్యార్థుల కోసం తెప్పించిన నిత్యావసర సరుకులకు పురుగులు పడుతున్నాయి. గోధుమ పిండి, ఇడ్లీపిండి, ఉప్మారవ్వకు పురుగులు పట్టాయి. రాగిమాల్ట్‌ తదితర వస్తువుల కాలపరిమితి ముగిసిపోయింది. ప్యాకింగ్‌లో ఉండగానే ఎండవేడిమికి వంటనూనె లీకేజీతో ఆవిరైపోతోంది. చక్కెరకు చీమల బెడద ఎక్కువైంది. లక్షల రుపాయలతో కొనుగోలు చేసిన సరుకులు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి.

నిత్యావసర సరకుల సరఫరా ఇలా..
జిల్లాలో 18 కేజీబీవీలు ఉన్నాయి. 3,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. నాణ్యమైన ఆహారం అందించేందుకు కావాల్సిన నిత్యావసర సరుకుల సరఫరా ఏజెన్సీ ద్వారా జరుగుతోంది. ఏటా ఏప్రిల్‌ 23 వరకు పాఠశాలలు కొనసాగుతుండటంతో రెండు నెలలకు సంబంధించిన సరుకులను ఆయా కేజీబీవీల స్పెషల్‌ ఆఫీసర్‌లు ఏజెన్సీల నుంచి తెప్పించి నిల్వ ఉంచారు. మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించటం..విద్యార్థులు ఇంటిబాట పట్టడంతో పాఠశాలలు మూతపడ్డాయి. పదోతరగతి పరీక్షల నేపథ్యంలో జూన్‌ 1 నుంచి ఆయా రెసిడెన్సియల్, ఆశ్రమ, పాఠశాలలు ప్రారంభించారు. అయితే  కేజీబీవీల్లో కాస్త ఆలస్యంగా విద్యార్థులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఏజెన్సీ ద్వారా  సరుకుల పంపిణీ చేశారు. పరీక్షలు వాయిదా పడటం విద్యార్థులకు ఇంటికి వెళ్లిన సంగతి తెలియంది కాదు. ప్రస్తుతం ఆయా పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో.. తెలియని పరిస్థితి నెలకొంది. ఇంకో వైపు  మిగిలిన విద్యాసంస్థల మాటేలా ఉన్న కేజీబీవీల్లో మాత్రం గోధుమపిండి 50 కిలోలపైన ఉంటుందని తెలుస్తోంది. ఇడ్లీపిండి, రాగిమాల్ట్, కుడకపోడి, అల్లంపెస్ట్, ధనియాల పౌడర్‌ తదితర వస్తువులన్ని పురుగులు పట్టి నాణ్యత కోల్పోయాయి.

కొన్నింట్లో సరే.. మరికొన్నింట్లో..
కోటపల్లి, నస్పూర్, మందమర్రి మోడల్‌ స్కూల్‌లో క్వారంటైన్‌ ఏర్పాటు చేయటంతో అక్కడ  ఎటువంటి సమస్య లేకుండా పోయింది. మరికొన్ని కేజీబీవీల్లో నిత్యావసర సరుకులను  ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఇదివరకే తహసీల్దార్‌లకు అప్పగించారు. మిగిలిన కేజీబీవీల్లో సరుకులకు మాత్రం పురుగులు పట్టి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. అయితే పురుగులు పట్టిన, కాలం చెల్లిన సరుకులు మినహా మిగిలన సరుకులు తీసుకెళ్లాలని పలుమార్లు సూచించినా నెలలు గడిచిపోతుండటంతో తామేమి చేసుకోవాలంటూ గుత్తేదారు మడతపేచి పెడుతున్నట్లు తెలుస్తోంది.  పురుగులు పట్టి, కాలం చెల్లిన (గడువు ముగిసిన) సరుకులు పోనూ మిగిలిన సరుకులైనా గుత్తేదారు తీసుకెళ్లటానికి నిరాసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యాసంస్థలు తెరుచుకోవటానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో సరుకుల పరిస్థితిపై ఎటూ తేలకుండా పోతోంది. ఈ విషయంపై డీఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు నడుచుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు