ఖరీఫ్‌ కొత్త ఆయకట్టు 8.89 లక్షల ఎకరాలు! 

24 Mar, 2018 03:01 IST|Sakshi

2019 జూన్‌ నాటికి మరో 6.55 లక్షల కొత్త ఆయకట్టు 

భారీ ప్రాజెక్టుల కింద 7.57లక్షలు, మధ్య, చిన్న తరహా కింద 

1.32 లక్షల ఎకరాలు నీటి పారుదల శాఖ పద్దులో పేర్కొన్న ప్రభుత్వం  

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది జూన్‌ నాటి(ఖరీఫ్‌)కి 8.89 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చేలా నీటిపారుదల శాఖ లక్ష్యం నిర్దేశించుకుంది. మరుసటి ఏడాదికి మరో 6.55 లక్షల ఎకరాల ఆయకట్టును విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు నీటి పారుదల శాఖ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పుస్తకాల్లో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 1.60 కోట్ల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టే నాటికి మొత్తం 52.20 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. 2004 నుంచి 2018 ఫిబ్రవరి వరకు మొత్తం 16.65 లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు మొత్తం 68.86 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో 2014 నుంచి ఇప్పటివరకు కొత్త రాష్ట్రంలో 10.95 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిందని తెలిపింది. 

2017–18లో గణనీయంగా కొత్త ఆయకట్టు 
2004లో చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టుల ద్వారా 2014 వరకు మరో 5.71 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తూ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో 2014 నుంచి 2018 మార్చి నాటికే 10.95 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. 2016–17లో అన్ని ప్రాజెక్టుల కింద కలిపి కేవలం 4.75 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వగా, 2017–18లో ఏకంగా 7.66 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చారు. ఇందులో మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల కిందే 5.50 లక్షల ఎకరాలున్నాయి. ఈ ఖరీఫ్‌లో భారీ ప్రాజెక్టుల కింద 7.57 లక్షలు, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల కింద 1.32 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. ఇందులో ఎస్సారెస్పీ–2, దేవాదుల, కల్వకుర్తి, ఇందిరమ్మ వరద కాల్వల కింద 5 లక్షల ఎకరాలను లక్ష్యంగా పెట్టుకుంది. 2019 జూన్‌ నాటికి మరో 6.55 లక్షల ఎకరాలను సాగులోకి తెస్తామన్న నీటి పారుదల శాఖ మొత్తం 15.44 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును లక్ష్యంగా పెట్టుకుంది.  

మరిన్ని వార్తలు