‘ఫార్మా’ భూసేకరణకు ఓకే

13 Jul, 2018 02:55 IST|Sakshi

పాత షరతులను సడలించిన కేంద్రపర్యావరణ శాఖ

రాష్ట్ర భూసేకరణ చట్టం ప్రకారం ప్రక్రియ

యజమానుల అంగీకారంతోనే భూములు సేకరించాలని గతంలో షరతు

తాజా సడలింపులతో ప్రభుత్వానికి ఊరట

సాక్షి, హైదరాబాద్‌: ఫార్మాసిటీ ప్రాజెక్టు భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. యజమానుల అంగీకారంతోనే ఫార్మాసిటీ ప్రాజెక్టు కోసం మిగులు భూసేకరణ ప్రక్రియ జరపాలని గతంలో విధించిన నిబంధనను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ సవరించింది. కేంద్ర భూసేకరణ చట్టానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ రాష్ట్ర భూసేకరణ, పునరావాస చట్టం–2016 ప్రకారం ‘యజమానుల అంగీకారం’తో మిగిలిన భూసేకరణ జరిపేందుకు అనుమతిచ్చింది.

యజమానుల అంగీకారంతోనే మిగులు భూసేకరణ జరపాలనే షరతుపై ఫార్మాసిటీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నిపుణుల మదింపు కమిటీ గతంలో సిఫారసు చేసింది. భూసేకరణతోపాటు మరో ఐదు అంశాలపై విధించిన నిబంధనలను సవరించాలని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ) విజ్ఞప్తి చేయగా, గత నెల 25న కమిటీ మళ్లీ సమావేశమై సానుకూలంగా నిర్ణయం తీసుకుంది.

దీంతో రాష్ట్ర భూసేకరణ, పునరావాస చట్టం–2016 కింద ఫార్మాసిటీ ప్రాజెక్టు అవసరాల కోసం భూములు సేకరించేందుకు ప్రధాన అడ్డంకి తొలగింది. ఈ చట్టంలోని ‘తప్పనిసరి భూసేకరణ’నిబంధన ప్రకారం యజమానులు అంగీకారం లేకపోయినా నిర్బంధంగా భూములు సేకరించే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. యజమానులు అంగీకరించనిపక్షంలో వారికి చెల్లించాల్సిన పునరావాస ప్యాకేజీ నిధులను భూసేకరణ అథారిటీ వద్ద జమ చేసి భూములను సేకరించవచ్చని ఈ నిబంధన పేర్కొంటోంది.

పట్టా భూములిచ్చేందుకు ససేమిరా  
ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ రంగ పారిశ్రామికవాడగా ఫార్మాసిటీని నిర్మించేందుకు రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్‌ మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం 19,333 ఎకరాలను సేకరిస్తోంది. అందులో 10,200 ఎకరాలు ప్రైవేటు పట్టా భూములు, 6199 ఎకరాలు అసైన్డ్‌ భూములుండగా, మిగిలినవి ప్రభుత్వ భూములు, కబ్జాకు గురైన ప్రభుత్వ భూములున్నాయి.

రైతులతో అంగీకార ఒప్పందం పేరుతో రాష్ట్ర భూసేకరణ చట్టం నిబంధనల ప్రకారం గంపగుత్తగా పరిహారం, పునరావాస ప్యాకేజీని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానికంగా ఎకరాకు మార్కెట్‌ విలువ రూ.2.5 లక్షలుండగా, భూసేకరణ చట్టం ప్రకారం మూడింతలు పరిహారంతోపాటు పునరావాసానికి ప్రత్యేక నిధులు కలిపి పట్టా, అసైన్డ్, కబ్జా భూములకు పరిహారపు ప్యాకేజీలను ఖరారు చేసింది. ఎకరా పట్టా భూములకు రూ.12.5 లక్షలు, అసైన్డ్‌ భూములకు రూ.8 లక్షలు, కబ్జా భూములకు రూ.7.5 లక్షల ప్యాకేజీలను చెల్లిస్తోంది.

ఇప్పటి వరకు 7,414 ఎకరాలను సేకరించగా, అందులో దాదాపు 7 వేల ఎకరాలు అసైన్డ్, ప్రభుత్వ భూములే ఉన్నాయి. పట్టా భూములు ఇచ్చేందుకు భూయజమానులు ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరిస్తోందని కొందరు స్థానిక రైతులు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో రైతుల అంగీకారంతోనే భూములు సేకరించాలని గతంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ నిబంధనలను విధించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో రాష్ట్ర భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించేందుకు అనుమతిస్తూ తాజాగా నిబంధనలను సడలించింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా