పలుచోట్ల లీకవుతున్న మిషన్‌ భగీరథ పైపులైన్లు 

19 Feb, 2019 09:50 IST|Sakshi
చుంచుపల్లి: కొత్తగూడెం–ఖమ్మం ప్రధాన రహదారిపై ఇటీవల మిషన్‌ భగీరథ పైపులైన్‌ పగిలి ఎగసిపడుతున్న నీళ్లు  

ప్రధాన లైన్‌కు వరుసగా మరమ్మతులు  

కొన్నిచోట్ల గాయాలపాలైన పౌరులు

నత్తనడకన సాగుతున్న ఇంట్రావిలేజ్‌ పనులు

పాల్వంచలో పైపులైన్‌ పనుల్లో ముగ్గురి మృతి 

సాక్షి, కొత్తగూడెం: ఇంటింటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం.. భగీ‘వ్యథ’గా మారింది. వరుసగా పైపులైన్లు లీకవుతున్నాయి. ప్రధాన పైపులైన్‌ తరచూ లీకవుతుండడంతో నీరు భారీగా ఎగసిపడుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో తిప్పలు తప్పడం లేదు. పలుచోట్ల పౌరులు గాయాలపాలవుతున్నారు. 16 నెలల క్రితం పైపులైన్‌ పనుల సమయంలో పాల్వంచ మండలంలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అనేక చోట్ల పైపులు లీకవుతూనే ఉన్నాయి. ఇక ఇంట్రావిలేజ్‌ పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి.  

  • చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలోని మూలమలుపు వద్ద జాయింట్‌ వాల్వ్‌ లీక్‌ అయి ఇటీవల నీరు ఏరులై పారింది. చండ్రుగొండలోని బొడ్రాయి సెంటర్, మసీదు వద్ద భగీరథ పైపులు పగిలాయి. 
  • అన్నపురెడ్డిపల్లి మండలంలో ఈ నెల 14వ తేదీన మండల కేంద్రంలోని బాలాజీస్వామి ఆలయం ఎదురుగాగల హోటల్‌ ముందు పైపు పగిలిపోవడంతో హోటల్‌ ధ్వంసమైంది. రేకులు మొత్తం కూలిపోయి ఇద్దరికి గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడైపోయాయి. ఇంట్లోకి మొత్తంనీరు వెళ్లింది. 
  • చర్ల మండల కేంద్రంలోని పూజారిగూడెం, కుదునూరు, కలివేరు గ్రామాల్లో వారం రోజుల క్రితం మిషన్‌ భగీరథ పైపులైన్లు పగిలిపోయి నీళ్లు వృథాగా పోయాయి. కలివేరు, పూజారిగూడెంలలో పగిలిన పైపులైన్లకు మరమ్మతులు చేయగా, కుదునూరులో పగిలిన పైపులైన్‌కు ఇంకా మరమ్మతులు చేయలేదు. 
  • ములకలపల్లి మండలంలో మిషన్‌ భగీరథ పథకంలో గత ఏడాది మే 20వ తేదీన పాల్వంచ నుంచి మండల పరిధిలోని రామచంద్రాపురం వరకు ట్రయల్‌రన్‌ చేయగా, మాదారం అటవీ ప్రాంతంలో పైపులైన్‌ లీకయింది. ఫౌంటెన్‌లా నీరు విరజిమ్మింది. సంబంధిత అధికారులు మరమ్మతులు నిర్వహించారు.  
  • 2018 జూలై 31వ తేదీన చుంచుపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న మిషన్‌ భగీరథ మెయిన్‌ పైప్‌ లైన్‌ పగిలిపోవడంతో అటుగా వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడటమే కాకుండా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ ఒక్కసారిగా లీకై పగిలిపోవడంతో భారీ ఎత్తున నీరు విడుదలయింది. దాదాపు 20 అడుగుల ఎత్తున నీరు ప్రవహించడంతో రహదారి నీటి ప్రవాహంగా మారింది. 
  • పాల్వంచ మండలం జగన్నాధపురం పంచాయతీ తోగ్గూడెం–జగన్నాధపురం గ్రామాల మధ్య మిషన్‌ భగీరథ వాటర్‌ గ్రిడ్‌ పనుల్లో భాగంగా బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనుల్లో.. 2017 అక్టోబర్‌ 7వ తేదీన నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలకు చెందిన ముగ్గురు మృతి చెందారు.వారు పైపులు బిగిస్తుండగా వర్షం కురిసింది. ఆ సమయంలో లోతులో పనిచేస్తున్నవారు పైకి వచ్చే పరిస్థితి లేక.. మట్టి పెళ్లలు పడడంతో ముగ్గురూ మృతి చెందారు.
మరిన్ని వార్తలు