సీసీ కెమెరాకు చిక్కిన చిరుత 

25 Mar, 2019 02:09 IST|Sakshi
లేగదూడలను తింటున్న చిరుతపులి

చరికొండలో నిఘా నేత్రానికి చిక్కిన పులి  

చిరుతను బంధించేందుకు రంగంలోకి ఫారెస్టు సిబ్బంది  

గోవిందాయిపల్లి, చరికొండ, కొత్తపల్లి ప్రాంతంలో బోనుల ఏర్పాటు 

కడ్తాల్‌(కల్వకుర్తి): కొన్ని రోజులుగా రైతులను భయాందోళనకు గురిచేస్తున్న చిరుతపులి మళ్లీ సీసీ కెమెరాకు చిక్కింది. కొన్నిరోజులుగా యాచారం, కడ్తాల్, కందుకూరు మండలాల్లోని గానుగుమార్ల తండా, గోవిందాయిపల్లి, ముద్విన్, తాటిపర్తి, కుర్మిద్ద, కొత్తపల్లి, చరికొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌ జోన్‌లో చిరుత సంచరిస్తూ పొలాల్లో కట్టేసిన లేగదూడలు, పశువులపై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. తాజాగా శనివారం తెల్లవారుజామున కడ్తాల్‌ మండలం గానుగుమార్ల తండాలో, చరికొండ గ్రామాల్లోని పశువుల పాకలపై దాడి చేసిన చిరుత రెండు చోట్ల లేగ దూడలను చంపేసింది. ఈ ఘటనపై రైతులు కందుకూరు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వివరాలు సేకరించారు.

చిరుత అడుగుజాడలను గుర్తించిన అధికారులు గోవిందాయిపల్లి, చరికొండ, కొత్తపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోని ఆరుచోట్ల బోనులతోపాటు సెన్సార్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం సెన్సార్‌ కెమెరాలను పరిశీలించిన అధికారులకు చరికొండ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు చిక్కాయి. శనివారం తెల్లవారుజామున దూడపై దాడిచేసిన దృశ్యాలు, దూడ కళేబరాన్ని గుట్టల్లోకి లాక్కెళ్లి తింటున్న దృశ్యాలు అందులో నమోదయ్యాయి. చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఆయా ప్రదేశాల్లో బోనులు ఏర్పాటు చేసినా వాటిలోకి వెళ్లకుండా చిరుత తప్పించుకొని తిరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కడ్తాల్, యాచారం, కందుకూరు మండలాల్లో సంచరిస్తున్న చిరుత ఒక్కటేనా..లేక అంతకంటే ఎక్కువ ఉన్నాయేమోనని అధికారులు, రైతుల్లో సందిగ్ధం నెలకొంది.  

ఆందోళన వద్దు  
ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు. చిరుతను బంధించేందుకు నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుంచి నిపుణులను రప్పించాం. గోవిందాయిపల్లి, చరికొండ, కొత్తపల్లి తదితర గ్రామాల సమీపంలో 6 చోట్ల బోనులు ఏర్పాటు చేశాం. రెండు, మూడ్రోజుల్లో ప్రత్యేకంగా జూపార్కు నుంచి మరో రెండు పెద్దబోనులను తెప్పిస్తాం. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి.  
 – సత్యనారాయణ, ఫారెస్ట్‌ రేంజర్, కందుకూరు  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు