35 కిలోమీటర్లు...30 నిమిషాలు!

22 Jan, 2019 09:41 IST|Sakshi
సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరుతున్న అంబులెన్స్‌

సికింద్రాబాద్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు...

గుండెను (లైవ్‌ ఆర్గాన్‌) తరలించిన వైద్యులు

గ్రీన్‌చానల్‌తో సహకరించిన ట్రాఫిక్‌ పోలీసులు

చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలింపు

సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి–శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య మార్గం... అనునిత్యం రద్దీగా ఉండే ఈ రూట్‌లో వాహనాల సరాసరి వేగం 25కి.మీ. మించదు... మధ్యాహ్నం వేళల్లో ఆ వేగం 20 దాటదు. మరోపక్క నగరంలో వాహనాల సరాసరి వేగం గంటకు 27.1 కిమీ మాత్రమే. అయితే సోమవారం ఆ మార్గంలో ‘ప్రయాణించాల్సిన’ గుండె (లైవ్‌ ఆర్గాన్‌) కోసం నగర ట్రాఫిక్‌ పోలీసులు ‘గ్రీన్‌ ఛానల్‌’ ఇచ్చారు. ఫలితంగా 35 కిమీ మార్గాన్ని అంబులెన్స్‌ కేవలం 30 నిమిషాల్లో అధిగమించింది. అంటే... గంటకు 60 కిమీ వేగంతో ప్రయాణించింది. అంబులెన్స్‌కు పైలెట్‌గా వాహనంలో వెళ్లిన బృందం మొదలు ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమష్టిగా, సమన్వయంతో పని చేయడంతోనే ఇది సాధ్యమైంది. 

మధ్యాహ్నం మొదలైన ‘ఆపరేషన్‌’...
నగర ట్రాఫిక్‌ విభాగంలోని అన్ని మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్‌లెస్‌ సెట్లు సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మోగాయి. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో బ్రెయిన్‌ డెడ్‌కు గురైన నిజామాబాద్‌ వాసి వంశీకృష్ణ (19) నుంచి సేకరించిన గుండెను శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రికి  చేర్చాల్సి ఉందని సందేశం వినిపించింది. చెన్నైలోని సదరు ఆస్పత్రిలో ఈ గుండెను రిసీవ్‌ చేసుకోవాల్సిన రోగికి ఆపరేషన్‌ సైతం ప్రారంభమైనట్లు వర్తమానం అందింది. ఈ లైవ్‌ ఆర్గాన్‌తో కూడిన అంబులెన్స్‌ మధ్యాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరనున్నట్లు  ట్రాఫిక్‌ పోలీసుల చేతుల్లో ఉన్న వాకీటాకీల్లో సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అన్నిస్థాయిల అధికారులు రంగంలోకి దిగారు. 12 గంటల నుంచే ఈ రూట్‌లో ఉన్న జంక్షన్లలో ట్రాఫిక్‌ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు చేపట్టారు. 

‘సెంటర్‌’ నుంచి నిరంతర పర్యవేక్షణ...
డోనర్‌ ఇచ్చిన గుండెతో కూడిన బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్‌ విమానాశ్రయం వరకు ఉన్న 35 కిమీ దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ రూట్‌ సైబరాబాద్‌ పరిధిలోనూ కొంత ఉండటంతో అక్కడి అధికారులతోనూ సమన్వయం చేసుకున్నారు. మహంకాళి ఇన్‌స్పెక్టర్‌ వేణుగోపాల్‌ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్లడానికి సిద్ధం కాగా, మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో ఉండే అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లోని ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంతం పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.

ప్రయాణించిన మార్గం ఇలా...
సరిగ్గా మధ్యాహ్నం 12.33 గంటలకు ‘లైవ్‌ ఆర్గాన్‌ బాక్స్‌’తో కూడిన అంబులెన్స్‌ సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరింది. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి చౌరస్తా, లక్డీకాపూల్, మాసబ్‌ట్యాంక్, మెహదీపట్నం, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌ వే మీదుగా కేవలం 30 నిమిషాల్లో సరిగ్గా మధ్యాహ్న 1.03 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్‌ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్‌ వాహనాలకు ‘గ్రీన్‌ ఛానల్‌’ ఇవ్వడంతో రికార్డు సమయంలో గమ్యం చేరుకోవడం సాధ్యమైంది. ఈ కాస్సేపు అంబులెన్స్‌ సైరన్‌కు పోటీగా ట్రాఫిక్‌ పోలీసులు వైర్‌లెస్‌ సెట్స్‌ నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న విమానంలో ఈ లైవ్‌ ఆర్గాన్‌ చెన్నై వెళ్లిపోయింది. ట్రాఫిక్‌ పోలీసుల సహకారంతోనే ఈ తరలింపు సాధ్యమైందంటూ యశోద ఆస్పత్రి యాజమాన్యం ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా