చెయ్యి కడుక్కోవే శీనన్నా...

27 Mar, 2020 08:36 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర సరకులు ఎలా అందుతున్నాయో పరిశీలించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నిన్న (గురువారం) ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి బంజారాహిల్స్‌ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా దానం ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌ యాదవ్‌కు శానిటైజర్‌తో చేతులు కడిగించారు. ప్రజలకు మరింత అవగాహన పెంచే దిశలో నాగేందర్‌ గత పది రోజుల నుంచి తన ఇంటి వద్ద ప్రత్యేకంగా శానిటైజర్‌లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ తానే దగ్గరుండి చేతులు శుభ్రం చేసుకునేలా అవగాహన కలిగిస్తున్నారు. (కరోనా కథ.. ఇల్లే సురక్షితం)

కాగా కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని మంత్రి తలసాని అన్నారు. నిన్న ఆయన బేగంబజార్‌లోని మిట్టికా షేర్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌లో వ్యాపారులతో సమావేశం అయ్యారు. మార్కెట్‌లో సుమారు 300 దుకాణాలు ఉన్నాయని, రోజుకు 40 దుకాణాల చొప్పున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల విక్రయాలు జరుపుకోవాలని సూచించారు. (బ్రేక్ 'కరోనా')

నిత్యావసరాలపై నిఘా 

అవినాష్‌ మహంతి నేతృత్వంలో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ 
రెండు రోజుల్లో  20 వేలకు పైగా పాసులు జారీ 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు  చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల్ని రవాణా చేసే వాహనాల కదలికల్ని సమీక్షించడానికి, పర్యవేక్షించడానికి, ఆయా విభాగాలతో సమన్వయానికి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ కొత్వాల్‌ అంజనీకుమార్‌ నిర్ణయం తీసుకున్నారు. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) సంయుక్త పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి దీనికి నేతృత్వం వహిస్తున్నారు. మొత్తం 25 మంది అధికారులతో ఉండే ఈ బృందం 24 గంటలూ మూడు షిఫ్టుల్లో నిర్విరామంగా సేవలు అందిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసర వస్తువులు తీసుకువచ్చే లారీలు, నగరంలో వాటిని డిస్ట్రిబ్యూట్‌ చేసే వాహనాల కదలికలకు ఆటంకం లేకుండా సాగేలా ఈ టీమ్‌ ఆద్యంతం పర్యవేక్షించనుంది. 

అలాగే మూడు కమిషనరేట్లకు చెందిన అధికారులు అత్యవసర సేవలు అందించే వ్యక్తులు, వాహనాలకు బుధవారం నుంచి ప్రత్యేక పాస్‌లు జారీ చేస్తున్నారు. దీనికోసం ఎవరికి వారు హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు. నిత్యావసర వస్తువుల్ని ఇళ్లకు సరఫరా చేసే ఈ–కామర్స్‌ వాహనాలు, వ్యక్తులు, కోళ్లు, కోడిగుడ్లు, ఆవులు, గేదెలు రవాణా చేసే వాహనాలు, కూరగాయలు తరలించే లారీలు, హాస్పిటల్స్‌లోని వివిధ విభాగాల్లో పని చేసే ఉద్యోగులు, వివిధ స్టార్‌ హోటళ్లు, లాడ్జిలలో పనిచేసే ఉద్యోగులకు, మండీలు, మార్కెట్లలో పని చేసే హమాలీలు, ఇతర ఉద్యోగులు చేపలు, మాంసం, వంటనూనె,పంచదార రవాణా చేసే వాహనాలు, కేబుల్‌ టీవీ, ఇంటర్‌నెట్‌ సేవల టెక్నీషియన్లకు కొన్ని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకు పాస్‌లు ఇస్తున్నారు. గురువారం రాత్రికి జారీ చేసిన పాసుల సంఖ్య 20 వేలు దాటింది. ఈ పాసులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులుని స్పష్టం చేస్తున్నారు   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా