ఎన్నికల ప్రచారం.. షురూ..!

24 Mar, 2019 17:38 IST|Sakshi

అభ్యర్థుల సరి‘కొత్త’ పరిచయం

పోరుకు టీఆర్‌ఎస్,     కాంగ్రెస్‌ పార్టీల శ్రీకారం

పార్టీల కార్యకర్తలతోనే సమావేశం

సాక్షి, మంచిర్యాల: ‘‘ఇతనే మన పార్టీ అభ్యర్థి... పార్టీ అధిష్టానం అన్నీ ఆలోచించే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మనం అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి.. పార్టీ మన మీద పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి..’’ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు చేస్తున్న సరికొత్త  ‘పరిచయ ప్రచారం’ ఇది. పెద్దపల్లి లోకసభకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించడం తెలిసిందే. కాంగ్రెస్‌ అభ్యర్థి నియోజకవర్గానికి పూర్తి కొత్త కాగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆ పార్టీకి కొత్త. దీంతో రెండు పార్టీలు శనివారం శ్రీకారం చుట్టిన ప్రచారపర్వంలో పరిచయ కార్యక్రమమే ఎక్కువగా కనిపించింది.

కార్యకర్తలతో మొదలు 
వచ్చే నెల 11న లోకసభ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారానికి సమాయత్తమయ్యాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఖరారయ్యారు. రెండు పార్టీలు కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో ఆయా పార్టీల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి, వికారాబాద్‌కు చెందిన ఎ.చంద్రశేఖర్‌ను ప్రకటించడం తెలిసిందే. చంద్రశేఖర్‌కు పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంతో సంబంధం లేకపోవడంతో, ఇతర ఆశావాహులు ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్‌ ఏకంగా పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. యువజన కాంగ్రెస్‌ నాయకుడు ఊట్ల వరప్రసాద్‌ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ క్రమంలో శనివారం మంచిర్యాల జిల్లాకు వచ్చిన చంద్రశేఖర్‌ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసార్‌రావు పార్టీ శ్రేణులు, నియోజకవర్గానికి  చంద్రశేఖర్‌ను కాంగ్రెస్‌ అభ్యర్థిగా పరిచయం చేశారు.

అనంతరం బెల్లంపల్లికి వెళ్లిన చంద్రశేఖర్‌ అక్కడ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇదిలాఉంటే కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన గంటల్లోనే పార్టీ టికెట్‌ అందుకున్న బొర్లకుంట వెంకటేశ్‌ది కూడా అదే పరిస్థితి. అవడానికి జిల్లా వాసి అయినా, రాజకీయాల్లో ఆయనది నాలుగు నెలల సీనియార్టీ మాత్రమే. అందునా టీఆర్‌ఎస్‌కు పూర్తిగా కొత్త. ఒకప్పటి ప్రత్యర్థి. తాజాగా టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి. దీంతో వెంకటేశ్‌ను టీఆర్‌ఎస్‌ శ్రేణులతో సమన్వయం చేసే బాధ్యతను చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తీసుకున్నారు. శనివారం మంచిర్యాలలోని పద్మనాయక కల్యాణ మండలంలో ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ ఇన్‌చార్జీ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యలతోపాటు ఎంపీ అభ్యర్థి వెంకటేశ్‌ పాల్గొన్నారు. వెంకటేశ్‌ను పార్టీ శ్రేణులకు పరిచయం చేసేందుకు వక్తలు అధిక సమయం తీసుకున్నారు.

బాధ్యత పెద్దలదే.. 
లోకసభ అభ్యర్థులు ఆయా పార్టీలకు కొత్త కావడంతో, ప్రచార, గెలుపు బాధ్యతలను పార్టీల పెద్దలు తలకెత్తుకొన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ రెండు పార్టీల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. టీఆర్‌ఎస్‌ తరఫున పార్టీని సమన్వయం చేయడం, ప్రచారం నిర్వహించడం, అభ్యర్థిని గెలిపించే బాధ్యతను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బాధ్యతలను జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు చేపట్టారు. పార్టీ నాయకులు, ప్రచార కార్యక్రమాలను ఆయన సమన్వయ పరుస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ముందు, పార్టీకి అభ్యర్థులను సమన్వయం చేసే సరికొత్త కార్యక్రమాన్ని రెండు ప్రధాన పార్టీలు ఒకే రోజు శ్రీకారం చుట్టడం ఆసక్తిగా మారింది

మరిన్ని వార్తలు