కబూతర్‌ జా..జా

26 Oct, 2019 08:09 IST|Sakshi

కపోతాల వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు  

నివారణకు జీహెచ్‌ఎంసీ చర్యలు  

శ్రీశైలం అటవీ ప్రాంతానికి తరలింపు  

మోజంజాహీ మార్కెట్‌లో 500 పావురాల పట్టివేత  

నగరంలో 6లక్షలకు పైగా కపోతాలు  

సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల ఆరోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమించిన పావురాలపై జీహెచ్‌ఎంసీ దృష్టిసారించింది. వీటిని అటవీ ప్రాంతానికి తరలించాలని నిర్ణయించింది. కపోతాల వల్ల శ్వాసకోశ సంబంధ సమస్యలు వ్యాపిస్తుండడంతో నివారణ చర్యలు చేపట్టింది. దీనిపై ‘సాక్షి’ ఇటీవల ‘రోగాల రాయబారులు’ పేరుతో కథనం ప్రచురించింది. స్పందించిన బల్దియా కేరళను వణికించిన నిఫా వైరస్‌ తరహాలో ఉపద్రవం ముంచుకు రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలని భావించి, నగరంలోని పావురాలను పట్టుకొని అటవీ ప్రాంతాల్లో వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీసిబ్బంది  శుక్రవారం మోజంజాహీ మార్కెట్‌లో 500 పావురాలను వలల ద్వారా పట్టుకొన్నారు. అటవీ శాఖ సలహా మేరకు వాటిని శ్రీశైలం అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు. నగరంలో ఇప్పటికే దాదాపు 6లక్షలకు పైగా పావురాలున్నట్లు అంచనా. వాస్తవానికి ఉద్యాన వనాల్లో పావురాలకు ఫీడింగ్‌ (ఆహార గింజలు) వేయడాన్ని బల్దియా గతంలోనే నిషేధించింది. ఇందులో భాగంగా శుక్రవారం మోజంజాహీ మార్కెట్‌లోనూ పావురాల ఫీడింగ్‌ కోసం విక్రయిస్తున్న గింజలను వెటర్నరీ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో దాదాపు 500 పావురాలను వలల ద్వారా పట్టి, శ్రీశైలం అటవీ ప్రాంతంలో వదిలామని జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం ఖైరతాబాద్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విల్సన్‌ తెలిపారు. మిగిలిన వాటిని కూడా అటవీ ప్రాంతంలో వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పావురాల వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని... ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులకు వెంటనే సోకుతాయని వివరించారు. పావురాలకు ఫీడింగ్‌ చేయొద్దని... ముఖ్యంగా మార్కెట్లు, ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాల వద్ద పావురాలను ప్రోత్సహించవద్దని కోరారు.  

పావురాలను తరలిస్తున్న సిబ్బంది
వ్యాధి కారకాలు...  
పావురాలు ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తికి కారణమవుతున్నాయి. వీటికి ప్రత్యేకంగా మూత్రకోశం ఉండదు. దీంతో విసర్జనలోనే మల, మూత్రాలు ఉంటాయి. వీటి రెట్టల నుంచి ఇన్‌ఫెక్షన్‌ కారక సూక్ష్మక్రిములు గాల్లో కలిసిపోతాయి. వీటి రెట్ట చాలా ప్రమాదకరం. రెక్కల నుంచి ఈకల ద్వారా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్‌ ఏసీల్లోకి చేరిపోతాయి. ఆ గాలిని పీల్చుకోవడం ద్వారా ప్రజలు వ్యాధిగ్రస్తులవుతున్నారు. చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతినే అవకాశం ఉంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులతో ఆస్పత్రుల పాలయ్యే రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలే కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధులు జలుబు, జ్వరంతో మొదలై ప్రాణాంతకంగా మారుతున్నాయి. అందుకే పావురాల రెక్కలు, రెట్టలను ముట్టుకోకూడదు. ఒకవేళ తాకినా చేతులు శుభ్రం చేసుకోకుండా ఏ పనీ చేయకూడదు. అలా చేస్తే ఇన్ఫెక్షన్లు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా