కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ వినూత్న ప్రయోగం

28 Aug, 2019 02:46 IST|Sakshi

మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ వినూత్న ప్రయోగం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ప్రభుత్వ పాఠశాలలంటే అందరిలోనూ చిన్నచూపు ఉంటుంది. చదువు బాగా చెప్పరని, తరగతి గదులు సరిగా ఉండవని, సర్కారీ స్కూళ్లన్నీ సమస్యల వలయం లోనే కొట్టుమిట్టాడతాయని భావిస్తారు. పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు చూస్తే ఆ అభిప్రాయాలు మార్చుకోక తప్పదు. చుట్టూ పచ్చని చెట్లు.. పరిశుభ్రమైన పరిసరాలు.. ఆకర్షణీయమైన తరగతి గదులు.. చూస్తే ఇది సర్కారీ స్కూలేనా అని ఆశ్చర్యపోయే రీతిలో పాలమూ రు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త శోభతో కనిపిస్తాయి. ఏళ్లుగా అనేక సమస్యలతో కొనసాగిన ఈ పాఠశాలల్లో ఇప్పుడు ఒక్కొక్క టిగా సదుపాయాలు సమకూరుతున్నాయి. కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ తీసుకున్న చొరవే ఇందుకు కారణం.

సర్కారీ స్కూళ్లంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రమే కాదని.. వాటి బాధ్యత అందరిపై ఉందని పేర్కొంటూ ‘ఇంటికి వంద.. బడికి చందా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి నుంచి స్వచ్ఛందంగా రూ.వంద వసూలు చేసి ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల న్నది దీని ఉద్దేశం. ఏడాది క్రితమే దీనికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, ప్రైవేట్‌ కంపెనీలు, స్వచ్చంద సంస్థ ల నిర్వాహకులంతా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు రూ.1.11 కోట్లు జమ కాగా, ఆ నిధులతో వసతులు కల్పిస్తున్నారు. 

అందరి భాగస్వామ్యంతోనే.. 
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న మహబూబ్‌నగర్‌ జిల్లా యంత్రాంగానికి అండగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయం. రూ.కోటికి పైగా వచ్చిన విరాళాలతో జిల్లాలో 601 ప్రభుత్వ పాఠశాలలను రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దుకుని.. స్వచ్ఛ పాఠశాలలుగా ప్రకటించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం అదే స్థాయిలో చదువు సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటున్నారు. ఇదంతా అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమైంది.     – రొనాల్డ్‌రోస్, కలెక్టర్, మహబూబ్‌నగర్‌ 


సమస్యలు గుర్తించి.. పరిష్కారం 

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 830 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 83వేల మంది చదువుతున్నారు. కనీస సదుపాయాలు లేకపోవడంతో ఈ పాఠశాలల్లో చేరేందుకు నిరుపేద విద్యార్థులు సైతం ముందుకు వచ్చేవారు కాదు. కొన్నిచోట్ల టాయిలెట్లు లేక.. ఉన్నచోట నిర్వహణ సరిగాలేక బాలికలు ఇబ్బందులు పడేవారు. దీంతో చదువుకు స్వస్తి పలికేవారు. ఫలితంగా విద్యార్థుల సంఖ్య పడిపోతూ వచ్చింది. ఆయా స్కూళ్లలో నెలకొన్న సమస్యలే దీనికి కారణమని గుర్తించిన కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ వాటిని పరిష్కరించాలని నిర్ణయించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ సదుపాయాలు కల్పించే బాధ్యతను భుజస్కందాలపై వేసుకున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న పాఠశాల నిర్వహణ నిధులు సరిపోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.వంద చొప్పున వసూలు చేసి ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా రు.  ఈ చర్యలతో ప్రభుత్వ స్కూళ్లలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 30వేల మంది ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 

ఎంతో కృషి చేశాం 
కొన్నేళ్లుగా పాఠశాలను పూర్తిస్థాయి స్వచ్ఛ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేస్తున్నాం. స్వచ్ఛభారత్‌ నిబంధనలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో వసతులు కల్పించినందుకు స్వచ్ఛ పాఠశాలగా ప్రకటించాం.  – బాలుయాదవ్‌ బైకని, హెచ్‌ఎం,జెడ్పీహెచ్‌ఎస్‌ ధర్మాపూర్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా