మందలించడమే శాపమైంది!

4 Dec, 2019 08:08 IST|Sakshi
రోదిస్తున్న కుటుంబసభ్యులు

మామను మట్టుబెట్టిన అల్లుడు

కామారెడ్డి క్రైం: తనను మందలించాడనే కోపంతో నిద్రిస్తున్న మామపై గొడ్డలితో అల్లుడు దాడి చేశాడు. తలపై బలంగా మోదడంతో మామ అక్కడికక్కడే చనిపోయిన సంఘటన లింగాపూర్‌ గ్రామంలో సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటనపై కామారెడ్డి రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం విచారణ జరిపారు. ఎస్సై శ్రీకాంత్‌ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రాజలింగం (70)కు ఒక్కగానొక్క కుమార్తె భీమవ్వ. లింగంపేట మండలం ఐలాపూర్‌ గ్రామానికి చెందిన ఇనుగుర్తి లక్ష్మణ్‌ను 30యేళ్ల క్రితం భీమవ్వతో వివాహాం జరిపించి ఇల్లరికం తెచ్చుకున్నాడు. భీమవ్వ–లక్ష్మణ్‌ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోమవారం రాత్రి వారి పక్కింట్లో వివాహా విందు జరుగుతోంది. విందుకు హాజరయ్యే జనం రాజలింగం ఇంటి ముందు వాహనాలు పార్కింగ్‌ చేశారు. లక్ష్మణ్‌ తన ఇంటి ముందు వాహనాలను నిలుపవద్దని వారించగా అతని భార్య భీమవ్వ అక్కడికి వచ్చింది.

వాహనాల పార్కింగ్‌ విషయంలో భార్యభర్తల మధ్య వాగ్వాదం మొదలైంది. భార్య, కూతురుపై లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడకు వచ్చిన మామ రాజలింగం లక్ష్మణ్‌పై మండిపడ్డాడు. వారి మధ్య మాటలు పెరిగి వివాదం పెద్దదైంది. ఆ తర్వాత రాజలింగం ఇంటిలోకి వెళ్లి పడుకున్నాడు. మామపై ఆగ్రహంతో ఉన్న లక్ష్మణ్‌ గొడ్డలితో తలపై బలంగా  దాడి చేశాడు. దీంతో రాజలింగం అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత లక్ష్మణ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా