పౌర సేవలు మరింత విస్తృతం

14 May, 2019 08:12 IST|Sakshi

అందుబాటులోకి వచ్చిన 2.0 వెర్షన్‌  

కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం

కంప్యూటర్, స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు

ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునే వీలు

సాక్షి, సిటీబ్యూరో: మీ సేవ కేంద్రానికి వెళ్లి గంటల తరబడిసర్వీసుల కోసం వేచి చూసే విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. రోజురోజుకూ సాంకేతికత పెరుగుతుండడంతో మీ సేవ కేంద్రాల్లో సేవలను వేగవంతం చేసేందుకు తెలంగాణ ఐటీ శాఖ 2.0 వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఏదైనా ధ్రువీకరణ పత్రం అవసరమైతే గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులు సమీపంలోని మీ సేవ కేంద్రాలకు వెళ్లేవారు. అక్కడ గంటల తరబడి నిల్చునేవారు, నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేసేవారు. ఈ విధానాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం కొత్తగా 2.0 వెర్షన్‌ ద్వారా సామాన్యులకు మీ సేవ దరఖాస్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్లు, డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌ట్యాప్‌ల ద్వారా ఎవరికి వారే వివిధ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు.

రిజిస్ట్రేషన్‌ ఇలా..
మీ స్మార్ట్‌ఫోన్‌లో లేదా కంప్యూటర్‌లో ఆన్‌లైన్‌ సర్వీస్‌ ద్వారా మీ సేవ 2.0 వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో కేఐఓఎస్‌కేలోకి వెళ్లాలి. ఇందులో మూడు రకాల సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సిటిజన్‌ సర్వీస్‌లోకి వెళ్లాలి. తర్వాత యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత పేరు, చిరునామా, ఆధార్‌ నంబరు, ఫోన్‌ నంబర్, ఈ మెయిల్‌ అడ్రస్‌ తదితర వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అనంతరం సెల్‌ఫోన్‌కి ఓటీపీ వస్తుంది. దాని తర్వాత హోం పేజీ వస్తుంది. అనంతరం లాగిన్‌ కావాలి. దీంతో 37 రకాల సేవలు పొందవచ్చు. మున్ముందు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సర్వీసులు ఇవే..
గతంలో రాష్ట్ర ప్రభుత్వం టీ–ఫోలియో యాప్‌ ద్వారా పలు సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో కొన్ని ఇబ్బందులు రావడంతో తాజాగా 1.0 సాఫ్ట్‌వేర్‌ నుంచి 2.0 వెర్షన్‌ను అప్‌గ్రేడ్‌ చేశారు. ప్రస్తుతం దీని ద్వారా 37 రకాల ప్రభుత్వ పౌర సేవలు ఇంటి వద్ద నుంచే పొందేందుకు వీలు కల్పించింది. ఇంటి నుంచే దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత అధికారులు ధ్రువపత్రాలను జారీ చేస్తారు. ఎస్‌ఎంఎస్‌ ద్వారా సెల్‌ఫోన్‌కి ఈ సమాచారం అందుతుంది. వెంటనే వినియోగదారుడు మీ సేవ కేంద్రానికి వెళ్లి ఆ ధ్రువపత్రాన్ని పొందవచ్చు. దీని ద్వారా ఆహార భద్రత, ఆదాయం, కులం, నివాసం, భూములకు సంబంధించిన ఆర్‌ఓఆర్, పహణీ తదితర ధ్రువపత్రాలతో పాటు 37 రకాల పౌర సేవలను పొందవచ్చు. ఈ సేవలకు గాను చెల్లించే రుసుం ఆన్‌లైన్‌ ఖాతా నుంచే చెల్లించవచ్చు. దీనిపై సందేహాలుంటే 1100, 18004251110 టోల్‌ఫ్రీ నంబర్‌ల ద్వారా లేదా  91210 06471, 91210 06472 వాట్సాప్‌ నంబర్ల ద్వారా తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు.  

పౌర సేవలు మరింత విస్తృతం
తెలంగాణ ఐటీ శాఖ రూపొందించిన మీ సేవ 2.0 వెర్షన్‌ ద్వారా పౌర సేవలు మరింత విస్తృతం కానున్నాయి. పౌరులు తమ సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్ల ద్వారా సిటిజన్‌ పేరుతో లాగిన్‌ అయి మీ సేవకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.– జీటీ వెంకటేశ్వరరావు, కమిషనర్, మీ సేవ

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా