అమరుల త్యాగం చిరస్మరణీయం

22 Oct, 2014 01:36 IST|Sakshi

సంగారెడ్డి క్రైం: సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల త్యాగం మరువలేనిదని, అలాంటి అమరవీరులను అక్టోబర్ 21వ తేదీన ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు గుర్తుంచుకోవాలని జిల్లా ఎస్పీ డా.శెముషీ బాజ్‌పాయ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సంద ర్భంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పౌరుల క్షేమం కోసం పోలీసులు ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధంగా ఉంటారన్నారు. పోలీసులు తమ జీవితాన్ని దేశం కోసం అంకితం చేస్తారన్నారు. దేశం కోసం, ప్రజలకోసం అమరులైన పోలీసుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబీకులు ఏ రోజైనా వచ్చి వారి సమస్యలు తెలియజేయవచ్చన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ, పోలీసుల సేవలు మరువలేనివన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబీకులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని సూచించారు. వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అడిషనల్ ఎస్పీ పి.రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, పోలీసు అమరవీరులు భౌతికంగా దూరమైనప్పటికీ ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరంజీవులుగా ఉన్నారన్నారు. అంతకుముందు దేశంలో అమరులైన 653 మంది పోలీసుల పేర్లను చదివిన ఏఎస్పీ రవీందర్‌రెడ్డి వారికి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఇక జిల్లాలో అమరులైన 21 మంది పోలీసుల కుటుంబాలతో జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పోలీసు అమరవీరుల స్థూపానికి ఎస్పీ శెముషీ, కలెక్టర్ రాహుల్ బొజ్జా పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ బాబురావు, జ్యోతిప్రకాష్, సంగారెడ్డి స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ విజయ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ కిషన్‌రావు, మహిళా పీఎస్ డీఎస్పీ లాల్ అహ్మద్, పట్టణ సీఐ ఆంజనేయులు, జహంగీర్, మస్తాన్‌వలీ, దుర్గారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు