జోరుగా మినరల్ వాటర్ వ్యాపారం

25 May, 2014 00:15 IST|Sakshi

 పరిగి, న్యూస్‌లైన్: లాభాల వేటలో వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. వేసవిలో నీటికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దీంతో బరిలోకి దిగిన వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛమైన మినరల్ నీరంటూ 20 లీటర్ల డ బ్బాకు రూ. 15 వసూలు చేస్తున్నారు. అయితే ఈ నీటి తయారీకి కనీస ప్రమాణాలు పాటించకున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పరిగి పట్టణం రోజురోజుకూ విస్తరిస్తుండటం, కొత్తగా పలు విద్యా సంస్థలు కూడా వెలియడంతో జనాభా కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో పట్టణంలో మినరల్ వాటర్ వినియోగం పెరిగిపోయి వ్యాపారులకు కాసుల పంటపండిస్తోంది.

 పరిగి పట్టణంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆరు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లాంట్ నుంచి రోజుకు 3వేల లీటర్ల వరకు నీటిని విక్రయిస్తున్నారు. ఆటోలు, ఇతర వాహనాల ద్వార డోర్ డెలివరీ చేస్తున్నారు. అయితే నీటిని సరఫరా చేసే కంపెనీ తమ బాటిళ్లపై కంపెనీ స్టిక్కర్ అతికించాలి. కాని పరిగిలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లకు చెందిన ఏ ఒక్కరూ బాటిళ్లకు స్టిక్కర్లు అతికించడం లేదు. ఇంటి దగ్గరకే నీరు వస్తుండటంతో ప్రజలు కూడా ఆలోచించకుండా కొనుగోలు చేస్తున్నారు.  శుద్ధి చేసిన నీటిలో క్రిమికీటకాలు రాకుండా ఓ రసాయన పదార్థాన్ని కలుపుతారు.

నీటిని ఫిల్టర్ చేశాక తిరిగి వాటిలో సమపాల్లలో మినరల్స్ కలపాల్సి ఉంటుంది. వీటని సంబంధిత కంపెనీలు ఆచరించటం లేదు. అంతేకాకుండా కనీసం బాటిళ్లను కూడా శుభ్రపర్చకపోవడంతో అవి నాచు పట్టి కనిపిస్తున్నాయి. గతంలో ఈ కంపెనీల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఎవరూ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని తేల్చారు. అయితే ఆ తర్వాత మాత్రం సదరు కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 అనుమతులు లేవు....
 పరిగి పట్టణంలో ఏర్పాటు చేసిన ఐదు మినరల్ వాటర్ ప్లాంట్లకు ఎలాంటి అనుమతులు లేవు. గ్రామ పంచాయతీ నుంచి నో అబ్‌జక్షన్ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు పంచాయతీ సిబ్బంది తెలిపారు. తదుపరి పంచాయతీ నుంచి ప్లాంటును నిర్మించడానికి, నీటిని విక్రయించడానికి ఎలాంటి అనుమతులు పొందలేదు. రెండు ప్లాంట్లకు తప్పా మిగితావాటికి ఐఎస్‌ఐ సర్టిఫికెట్‌లు కూడా లేవు. ఐఎస్‌ఐ సర్టిఫికెట్ పొందాలంటే అన్ని రకాల పరీక్షలను ప్లాంటు ఎదుర్కొవాల్సి ఉంటు ంది. దీంతో ప్లాంట్ల నిర్వాహకులు వెనుకడుగు వేస్తున్నారు. నామమాత్రపు అనుమతులు తీసుకున్నవారు కూడా రెన్యువల్ చేసుకోవాల్సిన విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకొని, స్వచ్ఛమైన నీటిని పంపిణీ చేసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు