2.5 ఎకరాలు..లక్ష మొక్కలు

12 Nov, 2019 10:26 IST|Sakshi

గచ్చిబౌలిలో మియవాకి అడవి ఏర్పాటుకు సన్నాహాలు పూర్తి

త్వరలో ప్లాంటేషన్‌ ప్రారంభం

గచ్చిబౌలి: జపాన్‌ వృక్ష శాస్త్రవేత్త అకిర మియవాకి అందించిన సాంకేతిక సహకారంతో జీహెచ్‌ఎంసీ అధికారులు మియవాకి అడవులను పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని కేంద్రీయ విశ్వ విద్యాలయంలో మియవాకి కోసం వెస్ట్‌ జోనల్‌ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే భూసారం పెంపొందించే ప్రక్రియ పూర్తి కాగా, మొక్కలు నాటేందుకు గుంతలు తీస్తున్నారు. త్వరలో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. జపాన్‌లోనిహిరోషిమా యూనివర్సిటీ శాస్త్రవేత్త అకిరా మియవాకి స్థానిక జాతుల మొక్కలతో సహజ అడవులను పురుద్ధరించడంపై అధ్యయనం చేశారు. ఈ నేపథ్యలో  పర్యావరణ క్షీణత కలిగిన నేలలపై మొక్కలు నాటి అడవులుగా తీర్చిదిద్దారు. బెంగళూర్, చెన్నై, మహరాష్ట్ర ప్రాంతాల్లో ఇప్పటికే ఈ తరహా మియవాకి అడవులను పెంచారు. తెలంగాణలోనూ ఈ తరహా అడవులను నెలకొల్పేందుకు ప్రయోగాత్మకంగా హెచ్‌సీయూలో సన్నాహాలు చేపట్టారు.

20 వేల ఆయుర్వేద మొక్కలు
2.5 ఎకరాల విస్తీర్ణంలో లక్ష మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే గుంతలు తవ్వే పనులు ప్రారంభమయ్యాయి. మొదటి దశలో 35 వేల మొక్కలు నాటనున్నారు. అనంతరం మూడు నెలల తర్వాత రెండో దశలో మరో 35 వేల మొక్కలు నాటుతారు. ఆ తర్వాత మరో మూడు నెలలకు మరో 30 వేల మొక్కలు నాటుతారు. బోరులో నీరు పుష్కలంగా ఉన్నందున కాల్వల ద్వారా నీటిని అందించనున్నట్లు వెస్ట్‌ జోనల్‌ యూబీడీ అధికారులు తెలిపారు. 67 రకాల మొక్కలు సిద్ధంగా ఉంచామని,  80 వేల మొక్కలు స్థానిక అడవి జాతి మొక్కలు కాగా, 20 వేల అయుర్వేద మొక్కలు నాటనున్నారు.  

పర్యావరణాన్ని పరిరక్షించాలి
పర్యావరణ పరిరక్షణకు మియవాకి అడవుల అభివృద్ధి ఎంతో అవసరం. వర్షాభావ పరిస్థితులతో పాటు కాలుష్యం సమస్య నానాటికి ఆందోళనకరంగా మారుతోంది. భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించేందుకు అడవులను పునరుద్దరించాల్సిన అవసరం   ఉంది. ఇప్పటికే బెంగళూరు, చెన్నైలలో ఈ తరహా అడవులను నెలకొల్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ త్వరలో మియవాకి సాంకేతికతతో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నాం.   – హరిచందన దాసరి, వెస్ట్‌ జోనల్‌ కమిషనర్‌

భూసారం పెంపు ఇలా..
హెచ్‌సీయూలో మియవాకి అడవుల కోసం కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో ఐదు అడుగుల మేర మట్టిని పూర్తిగా తొలగించారు. అందులో ఎర్ర మట్టి, కొబ్బరి పీచు, వరి పొట్టు, పశువుల, మేకల ఎరువు, వేప పిండితో నింపారు. కొబ్బరి పీచు, వరి పొట్టు తేమను ఎక్కువ రోజులు కాపాడతాయి. ఇందులో ఎలాంటి రసాయనాలు వాడటం లేదు.
7 మీటర్ల వెడల్పులో గుంతలు తవ్వి మొక్కలు నాటుతారు. మధ్యలో కొద్దిగా గ్యాప్‌ వదిలి ఏడు మీటర్లు వెడల్పులో మళ్లీ మొక్కలు నాటుతారు.
ఖాళీ స్థలంలోనే కాల్వలు చేసి నీటిని పారిస్తారు.
నీటి కొరత ఎదురైతే డ్రిప్‌ ద్వారా నీటిని అందిస్తారు.
ఒకే గుంతలో 8 నుంచి 12 మొక్కలు నాటుతారు.
మొక్కకు మొక్కకు చాలా తక్కువ దూరం ఉండటంతో సూర్యరశ్మి కోసం అవి పోటీపడతాయి. ఈ క్రమంలో కొన్ని మొక్కలు ఎండిపోయేందుకు అవకాశం ఉంటుంది.  
రెండేళ్ల అనంతరం అది చిట్టడవిగా మారడంతో నీటిని పారించాల్సి అవసరం ఉండదు.

మరిన్ని వార్తలు