ఈ ఆపరేషన్ మాకొద్దు

13 Sep, 2014 00:02 IST|Sakshi

ఘట్‌కేసర్: కుటుంబ నియంత్రణ గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించే ప్రభుత్వం ఆ ఆపరేషన్లు చేయించుకోవడానికి వచ్చే మహిళలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. దీంతో ఆపరేషన్లు చేయించుకోవడానికి ఆస్పత్రికి వచ్చిన మహిళలు అక్కడి పరిస్థితులు చూసి ఆందోళన చెందుతున్నారు. మళ్లీ వస్తామంటూ ఆపరేషన్లు చేయించుకోకుండానే వెనుదిరుగుతున్నారు.

 మండలంలోని నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం  మండల వ్యాప్తంగా మహిళలకు కుటుంబ నియంత్రణ (ట్యూబెక్టమి) ఆపరేషన్లు చేస్తున్నట్లు  ప్రకటించారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన 12 మంది మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి తమ పేర్లను నమోదు చేయించారు. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు సదరు 12 మంది మహిళలు ఆస్పత్రికి చేరుకున్నారు.

మొదట ఆరుమంది మహిళలకు ఆపరేషన్లు చేసి అందుబాటులో ఉన్న  6 మంచాలపై పడుకోబెట్టారు. అనంతరం వచ్చిన ఇద్దరు మహిళలను ఆపరేషన్ తర్వాత బెంచీలు, టేబుళ్లపై పడుకోబెట్టారు. ఈ పరిస్థితి గమనించిన మిగితా నలుగురు మహిళలు నివ్వెరపోయారు. ఆస్పత్రిలో ఇక బెంచీలు, టేబుళ్లు కూడా లేకపోవడంతో ఆపరేషన్ తర్వాత తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళనకు గురయ్యారు.

 మళ్లీ వచ్చి ఆపరేషన్ చేయించుకుంటామని చెప్పి అక్కడినుంచి వెనుదిరిగారు. కు.ని ఆపరేషన్లకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతోనే తాము భయపడి వెనుదిరిగినట్లు వారు విలేకరులతో గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకొని కు.ని ఆపరేషన్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. వైద్యులు నారాయణ రావు, సతీష్ చందర్‌ల నేతృత్వంలో కు.ని ఆపరేషన్లు కొనసాగాయి.

మరిన్ని వార్తలు