స్వామి సన్నిధిలో సంయమనం పాటించండి

9 Jun, 2020 02:39 IST|Sakshi

కరోనా నిబంధనలు పాటిస్తూనే దేవాలయాలకు రావాలి 

ఆన్‌లైన్‌ కైంకర్యాలను విస్తరిస్తాం 

ముందుగా బుక్‌ చేసుకుంటే పోస్ట్‌ ద్వారా ఇంటికే ప్రసాదం 

త్వరలో ప్రధాన ఆలయాల్లో ప్రారంభిస్తాం 

‘సాక్షి’తో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ‘భగవంతుడికి–భక్తుడికి మధ్య ఇంత విరామం అసాధారణం. లాక్‌డౌన్‌ వల్ల ఎడబాటు తప్పలేదు. జాగ్రత్తలతో దైవదర్శనానికి కేంద్రం అనుమతించటంతో రాష్ట్రంలో కూడా అందుకు అవకాశం కల్పించాం. భక్తులు హడావుడి పడకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామి దర్శనం చేసుకుంటే మంచిది. ఒకేసారి విరుచుకుపడకుండా భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకోవాలి. నేరుగా ఆలయానికి రావాల్సిన అవసరం లేకుండా కోరిన రోజు, కోరుకున్న సేవను స్వామి, అమ్మవార్లకు నిర్వహించేలా ఆన్‌లైన్‌ సేవలను మరింతగా విస్తరించబోతున్నాం’అని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. తొలిరోజు భక్తులు భారీ సంఖ్యలోనే ఆలయాలకు తరలి వచ్చారని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారని, భక్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని వెల్లడించారు. దేవాలయాలకు సంబంధించిన వివరాలపై సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

నిబంధనలు పాటిస్తే అంతా సంతోషమే 
లాక్‌డౌన్‌తో ఆగిపోయిన దర్శనాలు 78 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మొదలయ్యాయి. భక్తులు స్వామిని దర్శించుకోవాలన్న ఆత్రుత ఉంటుంది. కానీ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అనవసరంగా హడావుడి పడి తమతో పాటు తోటి వారిని ఇబ్బంది పెట్టొద్దు. తొలిరోజు ఆశించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. సంతోషంగా దర్శనం చేసుకుని వెళ్లారు. 

ఆదాయం కోల్పోవడంపై ఆలోచించలేదు.. 
లాక్‌డౌన్‌ వల్ల దేవాలయాలకు భక్తులు రాక దేవాదాయ శాఖకు దాదాపు రూ.200 కోట్ల ఆదాయం పోయింది. కానీ దీన్ని సీరియస్‌గా తీసుకోవట్లేదు. తప్పని పరిస్థితిలో ఆలయాలకు భక్తుల రాకను నిలిపేయాల్సి వచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తు.చ. తప్పకుండా పాటించాం. ఆదాయం కంటే భక్తులకు స్వామి దర్శనాలు ప్రశాంతంగా కల్పిస్తూ ఆలయాల్లో భక్తి పూర్వక వాతావరణాన్ని పెంపొందించటమే మా కర్తవ్యం. ఇప్పుడు ఆలయాలు తెరుచుకున్నందున భక్తులకు ఇబ్బందులు, భయాందోళనలు లేని దర్శనాలు నిర్వహిస్తాం. అందుకే కేంద్రం విధించిన నిబంధనలతో పాటు మరికొన్నింటిని అదనంగా చేర్చి అమలు చేస్తున్నాం. దీనికి భక్తులంతా సహకరించాలి. ఇక ఆలయాలకు ఆదాయం తగ్గినా వాటి నిర్వహణకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

ఏ ఇబ్బందీ రానీయలేదు
మూసి ఉన్న సమయంలో ఆలయాలకు ఆదాయం లేకున్నా అర్చకులు, ఆలయాల సిబ్బంది జీతాలకు, ధూపదీప నైవేద్యం పథకం కింద పేద దేవాలయాలకు చెల్లింపులకు ఎక్కడా లోటు రానీయలేదు. 4 వేలకు పైగా పేద దేవాలయాలకు చెల్లిస్తున్న ధూపదీప నైవేద్యం సాయాన్ని కొనసాగించాం. 3,600 మందికిపైగా అర్చకులకు చెల్లించాల్సిన జీతాలను చెల్లించాం. లాక్‌డౌన్‌ నిబంధనలు కొనసాగినన్నాళ్లూ ఆలయాల్లో స్వామి కైంకర్యాలు యథావిధిగా జరిగాయి. అర్చకులు వాటిని పద్ధతి ప్రకారం నిర్వహించారు. ఇప్పుడు కూడా ప్రత్యేక వేడుకలను అలాగే నిర్వహిస్తారు. 

ఆన్‌లైన్‌ దర్శనాలను విస్తరిస్తాం
ఇటీవల భద్రాచలం రాముల వారి కల్యాణ తలంబ్రాలను పోస్టు ద్వారా భక్తులకు పంపాం. 25 వేల మంది భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకున్నారు. అదే తరహాలో ఆన్‌లైన్‌లో ప్రధాన ఆలయాల్లో కోరుకున్న ఉత్సవాలను నిర్వహించుకుని స్వామి, అమ్మవార్ల ప్రసాదాలను పోస్టులో పొందే వీలు కల్పిస్తున్నాం. ప్రయోగాత్మకంగా కొన్ని దేవాలయాల్లో ప్రారంభించిన ఆన్‌లైన్‌ సేవలను ఇతర అన్ని ప్రధాన దేవాలయాలకు విస్తరిస్తున్నాం. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. విదేశీ భక్తులు కూడా ఖండాంతరాల నుంచే స్వామి సేవలో తరించొచ్చు.  

మరిన్ని వార్తలు