మిస్డ్‌కాల్.. విచారణ మిస్!

13 Aug, 2015 05:47 IST|Sakshi
మిస్డ్‌కాల్.. విచారణ మిస్!

కొంతమంది నిందితులతోనే సరి..  
బయటకురాని ‘పెద్ద మనుషుల’ పేర్లు  
విచారణ తీరుపై ఆరోపణలు  

 
వరంగల్ : సంచలనం సృష్టించిన      ‘మిస్డ్ కాల్’ కేసులో పోలీసు విచారణ ఎంతకీ ముందుకు కదలడం లేదు. అమ్మాయిలను ఎరవేసి   సమాజంలోని ఉన్నతస్థాయి వారిని, ప్రభుత్వ అధికారులను మోసం చేసిన విషయంలో వరంగల్ కమిషరేట్ పోలీసులు గతనెల 6న కొందరు నిందితులను అరెస్టు చేశారు. సమాజంలోని పలువురు పెద్దలు ఈ కేసులో ఉన్నట్లు చెప్పారు. మోసం చేసినవారుగా పేర్కొంటూ అరెస్టు చేసిన వారి వివరాలు వెల్లడించారు. మహిళలతో ఫోన్లో మాట్లాడి వారి పిలిచిన చోటికి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు  ఉన్న వారు ఎవరనే విషయాలు పోలీసులు చెప్పడం లేదు. సాధారణంగా అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్న అందరినీ నిందితులుగా భావించే పోలీసులు మిస్డ్ కాల్ కేసులో మాత్రం మహిళలను, మరికొందరిని అరెస్టు చేసి.. భాగస్వాములు అయిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో పోలీసుల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు.

 కేసును నీరుగార్చుతున్న పోలీసులు
 ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి ఉన్నతస్థాయి వ్యక్తులకు మహిళలతో ఫోన్‌లో మిస్డ్ కాల్‌తో పరిచయడం పెంచుకుని బ్లాక్ మెయిలింగ్‌కు తెరతీసిన వ్యవహారం గత నెలలో జిల్లాలో సంచలనం సృష్టించింది. పలువురు ఉన్నతస్థాయి అధికారులు, బడా వ్యాపారులు ఈ ముఠా ప్రలోభాలకు గురయ్యారు. వ్యభిచారం ముఠా వలలో చిక్కి ఏకంగా రూ.12 లక్షలు వసూలు చేశారు. ఇదే విషయంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాలోని ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. పరారీలో ఇద్దరు వ్యక్తులు చిక్కితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తామని పోలీసులు అప్పుడు చెప్పారు. వీరిని ఎంతకీ అరెస్టు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. పరారీలో ఉన్న ఇద్దరిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా, ఈ విషయాన్ని బహిరంగ పర్చడం లేదని తెలుస్తోంది. మరో కీలక నిందితుడిని అరెస్టు చేస్తే వ్యభిచారం ముఠాకు భారీగా డబ్బులు ఇచ్చిన ఉన్నతాధికారులు, వ్యాపారుల వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. వీరి వివరాలు బయటికి రాకుండా ఏదో మతలబు జరిగినందునే పోలీసులు ఈ కేసు విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు నిందితులను పట్టుకోకుండా కేసును నీరుగారుస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 పెద్ద మనుషులనేనా!
 మిస్డ్ కాల్ కేసులో భాగస్వామ్యం ఉన్న ‘పెద్ద మనుషుల’ను పోలీసులు బాధితులుగా చెబుతున్నారు. ఆర్టీసీ, ఎఫ్‌సీఐ, పాల డైరీలోని ఉన్నత ఉద్యోగులు, ఓ ప్రముఖ కంపెనీ షోరూం యజమాని ‘పెద్ద మనుషులలో’ ఉన్నట్లు కేసు వివరాలు వెల్లడించిన రోజున పోలీసులే స్వయంగా చెప్పారు. పెద్ద మనుషులను వ్యవహరాలను బ్లాక్‌మెయిల్ ముఠా వీడియో తీసిన టేపులు ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఈ విషయంలో ఉదాసీనంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. మిస్డ్‌కాల్ ముఠా వ్యవహరం బహిర్గతమైన తర్వాత ఉన్నతస్థాయి వ్యక్తులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. ముఠా సభ్యులు తమను బ్లాక్‌మెయిల్ చేసినట్లు వారు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో ఎందరో ప్రముఖులు ఉన్నా బ్లాక్‌మెయిలింగ్ ముఠా వీరినే లక్ష్యంగా ఎంచుకోవడానికి కారణాలు ఏమిటనేది పోలీసులకు తెలిసినా.. వీరి పేర్లను వెల్లడించకపోవడానికి కారణాలు ఏమిటనేది తెలియడం లేదు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు తమ పేర్లను వెల్లడించవద్దని పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఒప్పందం విషయంలో ఆలస్యం చేసిన కారణంగానే తన పేరును పోలీసులు బయటి కి వెల్లడించారని ఎఫ్‌సీఐ ఉద్యోగి ఒకరు సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. దీంతో మిగిలిన ‘పెద్దమనుషులు’ పోలీసులను సంప్రదించి మేనేజ్ చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మిగిలిన పోలీసుల పేర్లు బయటికి వచ్చినట్లు తెలుస్తోంది.
 

>
మరిన్ని వార్తలు