పలుకే బంగారమాయె..

11 Dec, 2017 03:42 IST|Sakshi

పెరిగిన డాటా... తగ్గిన మాట 

మెట్రో నగరాల్లో 51 శాతం యూజర్స్‌లో యువకులే టాప్‌ 

మొబైల్స్‌ ద్వారానే అత్యధిక డాటా వినియోగం 

సాక్షి, హైదరాబాద్‌ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో జనులు కాస్తా ‘నెట్‌’జనులుగా మారిపోతున్నారు. గతంలో ఎక్కడ నలుగురు కూడినా ఏదో అంశంపై చర్చ నడిచేది. ఇప్పుడు అలాంటి మాటలే దూరమయ్యాయి. మొబైల్, స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి రావడంతో అన్నిచోట్ల వాట్సాప్, చాటింగ్‌లు పెరిగిపోయాయి. కష్టం వచ్చినప్పుడు బాధ వెళ్లగక్కితే గుండె బరువు దిగేది. ఇప్పుడు ఆ బాధ వెళ్ల గక్కే అవకాశం దూరమవుతూ వస్తోంది. క్రమంగా మనుషుల మధ్య పలుకే బంగారమైపోయింది. మూగ సందేశాలతో నిశ్శబ్దం తాండవిస్తోంది. మెట్రో నగరాల్లో అయితే స్మార్ట్‌ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది.   

51 శాతంపైనే..
దేశంలోని అర్బన్‌ ప్రాంతాల్లో సుమారు 44.4 కోట్ల జనాభా ఉండగా. అందులో 26.9 కోట్ల (60 శాతం) మంది ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నట్లు ‘ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ మార్కెట్‌ రీసెర్చ్‌’ఇంటర్నేషనల్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మెట్రో నగరాల్లో సుమారు 51 శాతం మంది డాటా వినియోగిస్తున్నారు. ఇందులో 16 శాతం మంది నిరంతరం 4.304 కోట్ల జీబీ డాటాను వినియోగిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. వారంలో నాలుగైదుసార్లు వినియోగించేవారు 12 శాతం మంది ఉండగా, 3.23 కోట్ల జీబీ డాటా వినియోగమవుతోంది. వారానికి రెండుసార్లు వాడేవారు 14 శాతం మంది ఉండగా, వారానికి ఒకసారి వాడేవారు 8 శాతం మంది, నెలకు రెండుసార్లు వాడేవారు 5 శాతం మంది, నెలకు ఒకసారి వినియోగించేవారు 10 శాతం మంది ఉన్నారు. 

రోజూ వాడే వారిలో యువకులే టాప్‌.. 
రోజూ ఇంటర్నెట్‌ వినియోగించే వారిలో యువకులే అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రతిరోజు నెట్‌ వినియోగించే వారిలో.. 26 శాతం మంది యువకులు, 24 శాతం మంది కాలేజీ విద్యార్థులు, 19 శాతం మంది స్కూల్‌ పిల్లలు, 15 శాతం మంది వృద్ధులు, 10 శాతం మంది గృహిణులు, 8 శాతం మంది వర్కింగ్‌ ఉమెన్స్‌ ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద 60 శాతం మంది పురుషులు, 40 శాతం మంది మహిళలు డాటాను వినియోగిస్తున్నారు.

సోషల్‌ నెట్‌ వర్కింగే టాప్‌..
ఇంటర్నెట్‌ వినియోగంలో సోషల్‌ మీడియాదే అగ్రస్థానం. మొత్తం మీద 69 శాతం మంది సోషల్‌ నెట్‌ వర్కింగ్, 67 శాతం మంది ఆన్‌లైన్‌ కమ్యూనికేషన్స్, 50 శాతం మంది ఎంటర్‌టైన్‌మెంట్, 34 శాతం మంది ఆన్‌లైన్‌ షాపింగ్, 27% మంది ఆన్‌లైన్‌ సర్వీస్‌ల కోసం డాటాను వినియోగిస్తున్నారు. 

మొబైల్‌ ద్వారా వినియోగం
మొబైల్, స్మార్‌ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్‌ డాటా అత్యధికంగా వినియోగమవుతోంది. మొత్తం మీద మొబైల్, స్మార్ట్‌ ఫోన్ల ద్వారా 77 శాతం, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ ద్వారా 17 శాతం, ట్యాబ్లెట్‌ ద్వారా 7 శాతం వినియోగమవుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. మరోవైపు గృహాల నుంచే అత్యధికంగా డాటా వినియోగిస్తున్నారు. గృహాల్లో డాటా వినియోగం గత ఐదేళ్లలో 56 శాతం నుంచి 88 శాతానికి పెరగగా.. సైబర్‌ కేఫ్‌ల్లో వినియోగం 40 శాతం నుంచి 14 శాతానికి పడిపోయింది.

25 శాతం ఇంటర్నెట్‌కు దూరం
మెట్రో నగరాల్లో ఇప్పటికీ 25 శాతం మంది ఇంటర్నెట్‌కు దూరంగా ఉంటున్నారు. వీరిలో 2 శాతం మంది యువకులు ఉన్నారు. స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో లేక 11 శాతం, సమయం లేక 5 శాతం, కనెక్షన్‌ లేక 7 శాతం మంది డేటా వినియోగించడం లేదని అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా గత నాలుగేళ్ల క్రితం వరకు ఇంటర్నెట్‌ సెంటర్‌కు వెళ్లి అంతర్జాలాన్ని వినియోగించే కస్టమర్స్‌ల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు తమ ఇంటికే నేరుగా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకుంటున్నారు. మహానగరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు ఐడియా, ఎయిర్‌టెల్‌ తదితర పేరు పొందిన కంపెనీలతో పాటు సుమారు 200 వరకు ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ ఉండగా, కనెక్షన్‌దారుల సంఖ్య సుమారు 22 లక్షల వరకు ఉంటుందని అంచనా. 

మరిన్ని వార్తలు