వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.!

29 Oct, 2017 13:18 IST|Sakshi

మూడేళ్ల కుమారుడిని గొంతునులిమి చంపిన కసాయి తల్లి

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఘాతుకం

వనపర్తి : కట్టుకున్న భర్తను వదిలేసిన ఓ​భార్య.. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అభం శుభం తెలియని ఓ మూడేళ్ల చిన్నారిని బలి తీసుకుంది. తనతో కాపురం చేయకున్నా పర్వాలేదు.. తన సంతానాన్ని తనకు ఇవ్వాలని కాళ్లు మొక్కినా కనికరించని ఆ కసాయి తల్లి.. చివరికి కన్నపేగును తనే చిదేమిసిన సంఘటన వనపర్తిలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బిజినేపల్లి మండలం కొట్టాల్‌గడ్డ గ్రామానికి చెందిన నర్సింహగౌడ్‌కు అదే మండలం పాలెం గ్రామానికి చెందిన పద్మతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. నర్సింహగౌడ్‌ వికలాంగుడు కావడంతో గ్రామంలో కల్లు దుకాణం నిర్వహిస్తూ వచ్చే ఆదాయంతోపాటు వికలాంగ పింఛన్‌తో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి మీనాక్షి(6), కార్తీక్‌(3) సంతానం ఉన్నారు. భార్య పద్మ పాలెం అగ్రికల్చర్‌ యూనివర్శిటీలో దినసరి కూలీగా పనిచేస్తుండగా అక్కడే పనిచేస్తున్న మల్లేష్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయాన్ని తెలుసుకున్న భర్త నర్సింహగౌడ్‌ పద్ధతి మార్చుకోవాలని సూచించినా ఆమెలో మార్పురాలేదు. దీంతో కుటుంబంలో కలహాలు ప్రారంభమై పంచాయతీ దాకా వచ్చాయి. పంచాయతీలో పిల్లల భవిష్యత్‌ నాశనం చేయవద్దని ప్రాదేయపడినా భార్య వినలేదు.

వనపర్తికి మకాం..
సరిగ్గా రెండు నెలల క్రితం భర్తను వదిలి ఇద్దరు పిల్లలతోపాటు మల్లేష్‌తో కలిసి వనపర్తిలోని శంకర్‌గంజ్‌ కాలనీలో అద్దెగదిలో నివాసం ఉంటున్నారు. ప్రతి రోజు పద్మ కూలి పనిచేయగా వచ్చిన డబ్బులను మల్లేష్‌కు ఇచ్చేది. ఈ క్రమంలో పద్మ శనివారం ఉదయం కార్తీక్‌(3) అనారోగ్యంతో మృతి చెందాడని మృతదేహాన్ని తీసుకుని అత్తారింటికి కొట్టాల్‌గడ్డకు వెళ్లింది. దీంతో భర్త నర్సింహగౌడ్, అతని కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి బాబు ఎలా చనిపోయాడో చెప్పాలని.. పాప మీనాక్షి ఎక్కడ ఉందని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పింది. దీంతో నర్సింహగౌడ్‌, కుటుంబ సభ్యులు పాపను కూడా చంపివేసిందన్న అనుమానంతో కార్తీక్‌ మృతదేహాంతో పాటు పద్మను వాహనంలో ఎక్కించుకొని పాపను చూయించాలని కొట్టాల్‌గడ్డ నుంచి బయలుదేరారు. కర్నూలు తదితర ప్రాంతాలను తిప్పించి చివరికి వనపర్తిలోనే పాప ఉందని చెప్పడంతో వారు వనపర్తికి వచ్చారు. మల్లేష్‌ దగ్గర ఉన్న పాప మీనాక్షిని తమతో తీసుకుని మల్లేష్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

పోలీసులకు ఫిర్యాదు..
కార్తీక్‌ గొంతు నులిమి ఉండడం, చెవుల్లో రక్తం రావడాన్ని గమనించిన తండ్రి నర్సింహగౌడ్‌ తన కుమారుడిని హత్య చేశారని వనపర్తి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వనపర్తి సీఐ వెంకటేశ్వర్లు శనివారం రాత్రి 9 గంటలకు పద్మ అద్దెకు ఉంటున్న శంకర్‌గంజ్‌ కాలనీకి వెళ్లి గది తలుపులు తెరిపించి ప్రాథమిక విచారణ చేశారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పద్మ, మల్లేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. కార్తీక్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు