రాష్ట్రానికి 169 కోట్ల పరిహారమే వచ్చింది: కవిత

28 Dec, 2017 02:05 IST|Sakshi

జీఎస్టీ పరిహారం లెక్కింపును సమీక్షించాలని విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ పరిహారం కింద తెలంగాణకు గత రెండు నెలల్లో వచ్చింది కేవలం రూ.169 కోట్లేనని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత అన్నారు. 14 శాతం కంటే తక్కువ వృద్ధిరేటున్న రాష్ట్రాలకే పరిహారం దక్కుతోందని, 18 నుంచి 20 శాతం వృద్ధిరేటున్న తెలంగాణకు అందడంలేదని పేర్కొన్నారు. బుధవారం లోక్‌సభలో జీఎస్టీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. 14 శాతం బేస్‌రేటును సమీక్షించాలని కోరారు.

జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌లో ఇబ్బందులున్నాయని, చిన్న వర్తకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాండూరు రాయి పేదోళ్ల గ్రానైట్‌గా పేరొందిందని, దీనికీ జీఎస్టీ వర్తింపజేయడం అన్యాయమని పేర్కొన్నారు. పైగా 18 శాతం శ్లాబులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ కారణంగా బీడీ పరిశ్రమ దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆధారపడిన కార్మికుల్లో 99 శాతం మంది మహిళలేనని గుర్తుచేశారు. బీడీలు, చేనేతలు, హస్తకళలు, అటవీ ఉత్పత్తులపై ఉన్న జీఎస్టీని తొలగించాలని కోరారు. 

మరిన్ని వార్తలు