సర్వేపై అపోహలొద్దు

11 Aug, 2014 23:47 IST|Sakshi
సర్వేపై అపోహలొద్దు

డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
రామాయంపేట: ఈ నెల 19న ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి సర్వేపై ప్రజలు ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేం దుకు వచ్చిన ఆమె సోమవారం రామాయంపేట, రాయిలాపూర్ గ్రామాల్లో  జరిగిన సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 19న సర్వే చేపడుతున్నందున అందరు విధిగా ఇండ్లలో ఉండి సర్వే సిబ్బందికి సహకరించాలని, ఇండ్లలో లేని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవన్నారు.  

గ్రామాల్లో ప్రత్యేకాధికారితో పాటు తహశీల్దార్, ఎంపీడీఓ సర్వే విషయమై సమీక్ష జరుపుతారన్నారు. హైదరాబాద్ శాంతి భద్రతల అధికారాలను గవర్నర్‌కు అప్పగించే విషయమై ఆమె మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఉన్న నియమ నిబంధనలనే మన రాష్ర్టంలో కూడా పాటించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు కీలక పాత్ర పోషించారని, రాయిలాపూర్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. రుణమాఫీకి సంబంధించి వారం రోజుల్లో జీఓ విడుదల కానుందని, దసరా నుంచి  వృద్ధులు, వితంతువులకు  పెరిగిన పింఛన్లు  మంజూరవుతాయని తెలిపారు.

ఒక ఏడాదిపాటు  విద్యుత్ కోత ఉంటుందని, ఆ తరువాత 24 గంటల పాటు ఎలాంటి కోత లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుందని,  రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.  కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం,మెదక్ ఆర్డీఓ వనజాదేవి, రామాయంపేట ఎంపీపీ అధ్యక్షురాలు పుట్టి విజయలక్ష్మి, ఉపాధ్యక్షుడు జితేందర్‌గౌడ్, ఎంపీడీఓ అనసూయబాయి, జెడ్పీటీసీ సభ్యురాలు బిజ్జ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చెర్మైన్ రమణ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు