నేడే నాగోబాకు మహాపూజ

4 Feb, 2019 03:28 IST|Sakshi

మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభం కానున్న నాగోబా జాతర

ఇంద్రవెల్లి(ఖానాపూర్‌): ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్‌ నాగోబాకు పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని సోమవారం అర్ధరాత్రి మహాపూజ నిర్వహించనున్నారు. ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టేలా ఈ మహాపూజ నిర్వహించేందుకు మెస్రం వంశీయులు సర్వం సిద్ధం చేశారు. మెస్రం వంశీయుల మహాపూజలతో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ప్రారంభం కానుంది. ఈ నెల 10 వరకు అధికారికంగా..15 వరకు అనధికారికంగా జాతర జరగనుంది. గోదావరి నది హస్తిన మడుగు నుంచి పవిత్ర గంగాజలం తీసుకొని కాలినడకన మెస్రం వంశీయులు ఇప్పటికే కేస్లాపూర్‌ మర్రిచెట్టు (వడమర్ర)వద్దకు చేరుకున్నారు.

అక్కడ వారి సంప్రదాయం ప్రకారం మెస్రం వంశం లో మృతి చెందిన 91 మంది పేరిట ‘తుమ్‌’పూజలను ఆదివారం తెల్లవారు జామున నిర్వహించారు. పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకొని మర్రిచెట్టు వద్ద బస చేసిన మెస్రం వంశీయులు సోమవా రం ఉదయం నాగోబా ఆలయానికి చేరుకొని పూజలు చేయనున్నారు. మహాపూజ అనంతరం అతిథులుగా వచ్చే జిల్లా స్థాయి అధికారులు, ఇతర ప్రముఖులు ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహిస్తారు. మహాపూజ చేసిన మెస్రం వంశీయులు సోమ వారం రాత్రి ఒంటి గంట నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు భేటింగ్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటివరకు నాగోబా సన్నిధికి రాని మె స్రం వంశం కోడళ్లను నాగోబా దర్శనం చేయించి వారి వంశం పెద్దలను పరిచయం చేసి ఆశీస్సులు అందజేస్తారు. ఈ భేటింగ్‌తో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్టు భావిస్తారు. ఈ కార్యక్రమాలతో కేస్లాపూర్‌ నాగోబా జాతర ప్రారంభమైనట్లు పెద్దలు ప్రకటిస్తారు. సామాజిక శాస్త్రవేత్త హైమన్‌డార్ఫ్‌ శిష్యు డు మైకేల్‌ యోర్క్‌ జాతరకు రానున్నారు.  
 

మరిన్ని వార్తలు