రోడ్డెక్కుతారా.. తోలు తీస్తా...

17 Oct, 2018 02:09 IST|Sakshi
రైతు గల్లా పట్టి సుమోలోకి తోస్తున్న పోలీసులు

రైతులపై విరుచుకుపడ్డ నల్లగొండ టూటౌన్‌ సీఐ

నల్లగొండ అగ్రికల్చర్‌: ధాన్యం కొనాలంటూ ధర్నా చేసిన రైతులపై పోలీసులు లాఠీ ఝలిపించారు. ‘రోడ్డెక్కుతారా కొడకల్లారా.. తోలు తీస్తా’అంటూ నల్లగొండ టూటౌన్‌ సీఐ ఊగిపోతూ బూతు పురాణం అందుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన పలువురు రైతులపై పిడిగుద్దులు కురిపించి సుమోలోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. దీంతో మిగతా రైతులు భయపడి పరుగెత్తి బీట్‌ మార్కెట్‌ యార్డులో దాక్కున్నారు. మంగళవారం స్థానిక నల్లగొండ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు.

మూడ్రోజులుగా కొనుగోళ్లు లేకపోవడంతో యార్డులో పెద్దఎత్తున ధాన్యం రాశులు నిలిచిపోయాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో విసిగిన రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న టూటౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా చేస్తారా అంటూ రైతులపై విరుచుకుపడి లాఠీ చార్జ్‌ చేశారు. పోలీసుల తీరుపై రైతులు మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు