ఏ ప్రధానీ చేయని పని మోదీ చేశారు

12 Sep, 2018 01:31 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌. చిత్రంలో రాంచందర్‌రావు, లక్ష్మణ్, దత్తాత్రేయ, చుక్కా రామయ్య, కిషన్‌రెడ్డి తదితరులు

     విద్యార్థుల కోసం పుస్తకం రాశారు

     కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ అనే పుస్తకం రూపొందించారని, ఇప్పటి వరకు ఏ ప్రధానీ ఇలాంటి పని చేయలేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. ఎమెస్కో విజయకుమార్‌ ఆధ్వర్యంలో ఎగ్జామ్‌ వారియర్స్‌ తెలుగు అనువాద పుస్తకావిష్కరణ మంగళవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. పుస్తకాన్ని ఆవిష్కరించిన జవదేకర్‌ తొలి ప్రతిని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకి అందజేశారు. అనంతరం జవదేకర్‌ మాట్లాడుతూ.. ఎగ్జామ్‌ వారియర్స్‌ పుస్త కం ఒక విశిష్టమైన అనుభవం అని చెప్పారు. దేశంలోని ప్రతి విద్యార్థి ఈ పుస్తకాన్ని తప్పక చదవాలని సూచించారు. విద్యార్థుల బాగు కోసం ఏ ప్రధానీ చేయని పని మోదీ చేశారని గుర్తు చేశారు. ప్రపంచంలో భారత్‌ అన్నింట్లో నంబర్‌– 1గా ఉందని, దానికి కారణం మన విద్యార్థుల ప్రతిభేనని కితాబిచ్చారు.

దేశంలో మూడింట రెండు వంతులు 35 ఏళ్ల లోపు వారే ఉన్నారన్నారు. వారు దేశంలో కాక విదేశాల్లో కూడా వివిధ రంగాల్లో పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నారన్నారు. ఎగ్జామ్‌ వారియర్స్‌ పుస్తకం విద్యార్థులకు ఓ కరదీపిక లాంటిందన్నారు. అందులో సమయ పాలన మొదలు ఆటలు, యోగా ప్రయోజనాలు వరకు అన్ని విషయాలు ఉన్నాయని చెప్పారు. ఎగ్జామ్‌ వారి యర్స్‌ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదివి ప్రధానికి లేఖ రాయా లని సూచించారు. చుక్కా రామయ్య మాట్లాడుతూ, ఒక ప్రధాని విద్యార్థుల కోసం పుస్తకం రాయడం తాను మొదటి సారి వింటున్నానని చెప్పారు. హ్యూమన్‌ టచ్‌తో ఈ పుస్తకం రాశారన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ విజయకుమార్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్‌ బీవీ పట్టాభిరామ్, గీతాంజలి స్కూల్‌ ప్రిన్సిపాల్‌ గీతా కరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు