ఆర్టీసీకి జాతీయ పురస్కారాలు

28 Feb, 2018 00:52 IST|Sakshi
అవార్డు అందుకుంటున్న ఆర్టీసీ ఎండీ రమణారావు

ఇంధన పొదుపు, వాహన ఉత్పాదకత అంశాల్లో అవార్డులు 

సాక్షి, హైదరాబాద్‌: ఇంధన పొదుపు, వాహన ఉత్పాదకతలో టీఎస్‌ఆర్టీసీ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. కొన్నేళ్లుగా ఈ విభాగాల్లో ఉత్తమ రవాణాసంస్థగా పురస్కారాలు సొంతం చేసుకుంటున్న ఆర్టీసీ ఈసారీ అవార్డులను దక్కించుకుంది. 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను పలు విభాగాల్లో ఎంపిక చేసిన రవాణా సంస్థలకు అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్టీయూ) ఢిల్లీలో జరిగిన 62వ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో పురస్కారాలు ప్రదానం చేసింది.

వాహన ఉత్పాదకత, ఇంధన పొదుపులో టీఎస్‌ఆర్టీసీ ఉత్తమ రవాణా సంస్థగా పురస్కారాలు దక్కించుకుంది. వాహన ఉత్పాదకతలో 318.27 కి.మీ. నుంచి 328.27 కి.మీ.(కి.మీ./వెహికల్‌/డే)కు మెరుగుపరుచుకుని టాప్‌లో నిలిచింది. ఇక 7,500 వాహనాలు ఉన్న రవాణాసంస్థల కేటగిరీలో ఇంధనపొదుపునకు సంబంధించి 5.51 కేఎంపీఎల్‌తో ఉత్తమంగా నిలిచింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ (మోర్త్‌)కార్యదర్శి యధువీర్‌సింగ్, సంయుక్త కార్యదర్శి అభయ్‌ దామ్లేల చేతుల మీదుగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ రమణారావు పురస్కారాలు అందుకున్నారు. అధికారులు, కార్మికుల కృషి వల్లనే పురస్కారాలు సాధించినట్లు ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు