క్షురకులను ఆదుకోండి: లింగం

7 May, 2020 13:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా ఆకలితో అలమటిస్తున్న క్షురకులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా నెలన్నర రోజులుగా క్షౌరశాలలను మూసివేయడంతో వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్‌ మద్దికుంట లింగం నాయీ ఒక ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందన్నారు. క్షౌర వృత్తిదారులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక ప్రభుత్వాలు రూ. 5 వేలు చొప్పున సహాయం అందిస్తున్నాయని తెలిపారు.

తెలంగాణలో అమలు చేస్తున్న రెడ్‌జోన్లలో 35 వేలకు పైగా క్షౌరశాలలు ఇప్పటికీ మూతపడివున్నాయని వెల్లడించారు. వీటిపై ఆధారపడి జీవి​స్తున్న వృత్తిదారుల జీవనం దుర్భరంగా మారిందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి క్షౌర వృత్తిదారులకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవస్థానాల్లోని కల్యాణ్‌ కట్టలో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కూడా ఇదే విధంగా తోడ్పాటు అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సెలూన్లకు మూడు నెలల పాటు కరెంట్‌ బిల్లులు, అద్దె మాఫీ చేయాలని లింగం నాయీ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు