ప్రధానిపై సామాన్యుడి వ్యంగ్యాస్త్రం

5 Jun, 2018 14:36 IST|Sakshi
కలెక్టర్‌కు అందించిన తొమ్మిది పైసల చెక్కు  

సిరిసిల్లటౌన్‌ : పెట్రో ధరల అమలులో కేంద్ర సర్కారు తల.. తోక లేకుండా వ్యçవహరించండంపై సామాన్యుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. రూపాయల్లో పెంచుతూ.. పైసల్లో తగ్గిస్తే..ప్రజలకు ఒనగూరేదేమి లేదంటూ ఓ సామాన్యుడు తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశాడు. నిన్న తగ్గించిన 0.09 పైసలను చెక్కు రూపంలో పీఎం సహాయనిధికి విరాళంగా ఇస్తూ.. వ్యంగ్యాస్త్రాన్ని సంధించాడు.

సిరిసిల్ల అర్బన్‌ మండలం చంద్రంపేటకు చెందిన వీరగోని చందు సోమవారం తన బైక్‌లో సిరిసిల్లలోని భారత్‌ పెట్రోలియంకు చెందిన బంక్‌ కే. శ్రీనివాస్‌ అండ్‌ కంపెనీలో పెట్రోల్‌ పోయించుకున్నాడు. దీనికిగాను బంక్‌నుంచి రశీదు తీసుకోగా.. అతడికి 0.09 తగ్గించి, రూ.82.87 పైసలకు లీటర్‌గా రశీదు ఇచ్చారు. చందు తన జేబునుంచి రూ.100 నోటు బంక్‌లో ఇవ్వగా రూ. 13 రూపాయలు మాత్రమే చెల్లించారు.

మిగతా చిల్లర ఇవ్వాలని కోరగా..0.87 పైసలు ఇస్తే రూ.1 ఇస్తామని బంక్‌ సిబ్బంది ఎదురు ప్రశ్నించారని చందు పేర్కొన్నాడు. ప్రభుత్వం తగ్గించిన 0.09 పైసలతో పాటు అదనంగా 13పైసలు కూడా బంక్‌ సిబ్బంది ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి చెందాడు. కేంద్ర సర్కారు తీరుపై నిరసన తెలుపుతూ..0.09 పైసలను చెక్కు రూపలో ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా పంపించాలంటూ కలెక్టర్‌కు అందించాడు.

మరిన్ని వార్తలు